ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) బుధవారం ఆరంభమైంది. మే 9 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఎంతో మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. మార్కెట్ నుంచి 21,000 కోట్లను సమీకరించడానికి కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. అయితే ఐపీవో ఆరంభానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5,620 కోట్లను ఎల్ఐసీ సమీకరించింది. ఈ ఇష్యూలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో 3.5 శాతం వాటాను విక్రయిస్తోంది.
ఎల్ఐసీ ఐపీవో ధర రూ.902 నుంచి రూ.949 మధ్యలో ఉండగా.. పాలసీదార్లకు రూ.60, రీటైలర్లు,ఉద్యోగులకు రూ.45 చొప్పున డిస్కౌంట్లు ఇస్తున్నారు. అయితే ఇష్యూ ఆరంభమైన మొదటి రెండు గంటల్లోనే (మధ్యాహ్నం 12 గంటలకు) పాలసీదారులకు కేటాయించిన కోటా మేరకు పూర్తి బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా 28 శాతం ఇష్యూకు సరిపడా బిడ్లు దాఖలయ్యాయి. ఈ ఇష్యూ ఈ నెల 9న ముగియనుంది. 17న స్టాక్ ఎక్సేంజ్ లలో ఎల్ఐసీ లిస్ట్ కానుంది.