ది బ్యూటిఫుల్ ఓల్డ్ ‘లై’!  - MicTv.in - Telugu News
mictv telugu

ది బ్యూటిఫుల్ ఓల్డ్ ‘లై’! 

August 11, 2017

చిత్రం :  లై

ఉప శీర్షిక : లవ్ ఇంటలిజెన్స్ ఎమినిటి

నిడివి :  144 నిముషాల  36 సెకన్లు

సమర్పణ :  వెంకట్ బోయనపల్లి

బేనర్ : 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్

సినిమాటోగ్రఫి : జె. యువరాజ్

ఎడిటింగ్ : యస్ ఆర్ శేఖర్

పాటలు : కృష్ణకాంత్, కాకర్ల శ్యామ్

సంగీతం : మణిశర్మ

నిర్మాతలు :  రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర

కథ – స్క్రీన్ ప్లే – మాటలు – దర్శకత్వం : హను రాఘవపూడి

నటులు : నితిన్, మేఘా ఆకాష్, అర్జున్ సర్జా, రవికాంత్, శ్రీరామ్, అజయ్, నాజర్, రవికిషన్, బ్రహ్మాజీ, పృధ్వీతేజ్, పూర్ణిమ తదితరులు

లై. అబద్దం. అందంగా వుండాలి. వుంది. అయితే ఆడిన అబద్దమే ఆడినట్టు వుంది. అబద్దం కొత్తగా వుండాలి. కాని పాత అబద్దమే. కాకపోతే ఇంగ్లీషులో ‘లై’!

మార్కెట్ మనకు లేని అంచనాలను అందిస్తుంది. హీరో మళ్ళీ ఫామ్ లో వున్నాడనో.. డైరెక్టర్ యిది వరకే హిట్లు యిచ్చాడనో.. యాభై కోట్ల బడ్జెట్ తో తీసారానో.. బేనరనో.. ప్రచారంతోనో.. యెక్కువ వూహించుకు సినిమాకు వెళతాం. పాత సినిమానే కొత్తగా చూస్తాం. పాత అనుభవాన్నే కొత్తగా చూస్తాం. టెక్నాలజీ అదనం. ‘లై’ అని అనుకుంటాం.

కథ కొస్తే- బహు పేదగా బలాదూర్ గా తిరిగే ఎ. సత్యం(నితిన్) వాడుక బాషలో అసత్యం డబ్బులకు యిబ్బంది పడుతూ వుంటే పెళ్లి చేసుకోరా అని తల్లి అతనితో తలపడుతూ వుంటుంది. వెగాస్ లో వున్న ఫ్రెండు యిక్కడ అమ్మాయిలు పెళ్ళికి దొరుకుతారని చెప్పడంతో వెళ్లాలని అనుకుంటాడు. సమాంతరంగా పిసనారి(అన్నారు కాని పొదుపరి) అయిన చైత్రం (మేఘా ఆకాష్- తొలిపరిచయం) అందమైన లోకేషన్స్ చూసి వెళ్ళాలని అనుకుంటుంది. హీరో దొంగతనాలు చేస్తే, హీరోయిన్ యెవడో వొకన్ని పెళ్ళాడితే చాలు అని మార్గాలుగా ఎంచుకుంటారు. అందుకని భార్యాభర్తలుగా అనుకోని పరిస్థితుల్లో వెగాస్ వెళతారు. అక్కడ అతను ఇంటలిజెన్స్ కు చెందినవాడిగా రివీల్ అవుతుంది. విలన్ ‘మామ’ వూరుకుంటాడా? ఊరుకోడు. ఇద్దరూ యెత్తుకు పై యెత్తులు వేస్తారు. పై చేయి హీరోదే. చెప్పక ముందే తెలిసిపోయే తెలుగు సినిమా కథ!

‘ధృవ’ సినిమాలో లా బలమైన విలన్(అర్జున్). పేరు మాత్రం బ్రహ్మానందం. అతనో మెజీషియన్. ఎక్కడా మేజిక్కులు చెయ్యడు. కోటు కుట్టించు కోవడం కోసం  ఇండియా వచ్చి ఇరుక్కుంటాడు. ఇంటలిజెన్స్ వాళ్ళు వెంటపడతారు. చాలక ఇంద్రుడూ నారదుడూ కామిక్ గా నడుస్తున్న కథని చెపుతూ వుంటారు. నిజానికి సృష్టి కార్యం చేసేది బ్రహ్మ. తన సీటుకు యెసరు వస్తే కాని కదలడు. ఆయన కథలోకి యెందుకు వస్తాడో తెలీదు. కామిడీ కోసం అని సరిపెట్టుకోవాలి. ఇది లై కదూ? సరే లాజిక్ వదిలి మేజిక్ చూద్దామంటే యెన్నో రూపాలు మార్చే విలన్ అసలు యేమి చేస్తాడో తెలీదు. ఆకోటులోని బ్రహ్మ పదార్ధం వుంది అని చూపించి అది చివరకు మాయమవుతుంది. నకిలీ కోటుని నిజం కోటని నమ్మే విలన్. లై కదూ? డబ్బుకోసం ముక్కూ ముఖం తెలియని వాడివెంట వెళ్ళే హీరోయిన్. లై కదూ? హీరో ఇంటలిజెన్స్ లో చేస్తూ దొంగతనాలు చేయడం లై కదూ?

ఫక్తు సినిమా లై. స్టైలిష్ గా వుంది. అందమైన లోకేషన్స్ లో తీసారు. కథ కలగా పులగంగా వుంది. ఇంటలెక్చువాలిటీ అని పేరు పెట్టడానికి లేదు. సూటిగా లేదు. థ్రిల్లింగ్ అని అందామా అంటే- పూర్తి స్థాయి థ్రిల్లర్ గానూ చెయ్యలేదు. పూర్తిగా అబద్దాలతో సాగే హీరో హీరోయిన్ ట్రాక్ బావున్నా అందులో ఎమోషన్ లేదు. పాటలు విని మర్చిపోతాం.

నితిన్ అందంగా కనిపించాడు. ఒప్పించాడు. అర్జున్ మెప్పించాడు. హీరోయిన్ అందంగా వున్నా అవకాశం లేదు. కథ మాటలు చెప్పుకోవడానికి లేదు. స్క్రీన్ ప్లే మరింత పకట్బందీగా రాసుకొని వుండాల్సింది. మేకింగ్ బావుంది. సినిమా మాత్రమే ప్చ్..

రేటింగ్: 2.25/5

-జాసి