మిషన్ భగీరథ.. జీవన్మరణ సమస్య - MicTv.in - Telugu News
mictv telugu

మిషన్ భగీరథ.. జీవన్మరణ సమస్య

August 24, 2017

తాగునీటి సదుపాయాల కల్పన కోసం చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని సీఎం కేసీఆర్ గురువారం అధికారులతో, ప్రజాప్రతినిధులతో కలసి సమీక్షించారు. ఈ పథకం ప్రభుత్వానికి జీవన్మరణ సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు.  పథక లక్ష్యాలను నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేయాలని సూచించారు..

‘‘ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించడానికి రూ. 43వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నాం.  ఇది రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన అంశం. జనావాస ప్రాంతాలకు మనం కనీసం మంచి నీరు కూడా ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీనే చేయబోమన్న మన ప్రతినను సవాలుగా తీసుకుని పనిచేస్తున్నాం..’’ అని ఆయన చెప్పారు.

పథకం లక్ష్యానికి తగ్గట్టు పనులను వేగంగా పూర్తి చేసి, ప్రజలందరికీ మంచినీరివ్వాలని ఆదేశించారు. ఈ ఏడాది చివరికల్లా అన్ని నివాస ప్రాంతాలకు వివిధ ప్లాంట్లు, ట్యాంకుల ద్వారా తాగునీరు ఇవ్వాలని, దీని కోసం సెప్టెంబర్ నుంచి పనులు ప్రారంభించాలని సూచించారు.