life imprisonment for a army captain who killed three in fake encounter
mictv telugu

ఫేక్ ఎన్‌కౌంటర్ కేసులో ఆర్మీ అధికారికి షాక్..జీవితఖైదు విధించిన కోర్టు

March 6, 2023

life imprisonment for a army captain who killed three in fake encounter

జమ్మూకశ్మీర్‌లోని ఆర్మీ కోర్ట్ సంచలన తీర్పును వెల్లడించింది. షోపియాన్‌ జిల్లాలో ఫేక్ ఎన్‌కౌంటర్‌‏కు పాల్పడిన ఆర్మీ అధికారి కెప్టెన్ భూపిందర్ సింగ్‌ కు జీవితఖైదు విధించింది. బూటకపు ఎన్‌కౌంటర్‌లో ముగ్గుర అమాయకుల ప్రాణాలను బలిగొన్నాడు ఈ అధికారి. ఈ మధ్యనే భూపిందర్‏కు మార్షల్ విచారణ పూర్తికావడంతో ఎట్టకేలకు అత్యున్నత అధికారులు ఈ శిక్షను ఖరారు చేశారు.

2020 జూలైలో షోపియాన్ జిల్లాలోని అమ్‌షిపోరాలో జరిగిన ఎన్‏కౌంటర్‏లో ముగ్గురు కార్మికులు చనిపోయారు. అయితే వారు పాకిస్థానీ ఉగ్రవాదులని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. వీరి మరణంతో జిల్లాలో ఉగ్రవాద ముప్పు తొలగిపోయిందని తెలిపారు. నాటి ఆర్మీ కెప్టెన్ భూపేంద్ర సింగ్ నాయకత్వంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. అయితే రెండు రోజుల తర్వాత హత్యకు గురైన ముగ్గురు యువకులు రాజౌరీ జిల్లాకు చెందిన వారుగా స్థానికులు గుర్తించారు. కూలీ పనులు చేసుకుంటున్న తమ పిల్లలను దారుణంగా కాల్చారని బంధువులు ఆరోపించారు. కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టడంతో ఆర్మీ అధికారులు ఈ ఎన్ కౌంటర్ పై విచారణకు ఆదేశించారు.

సైనిక దళాల ప్రత్యేక అధికార చట్టం కింద నిబంధనలకు విరుద్ధంగా అధికారాలను దుర్వినియోగం చేసిన ఆర్మీ అధికారులపై విచారణకు కోర్టు ఆదేశించింది. ఈ ఎన్ కౌంటర్ లో జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేసి భూపేంద్ర సింగ్ సహా ముగ్గరిపై చార్జ్ షీటు దాఖలు చేశారు. ఈ కేసులో భూపేందర్ సింగ్ జరిపింది ఫేక్ ఎన్ కౌంటర్ అని తేలింది. సాక్ష్యాలు లభించడంతో కోర్టు అతడికి జీవితఖైదు విధించింది. ఈ తీర్పుపై పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ హర్షం వ్యక్తం చేశారు. సైనిక ప్రతినిధి కూడా సానుకూలంగా స్పందించారు.