ఉగ్రవాదం, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి కేసులో కశ్మీర్ వేర్పాటు వాద నేత యాసిన్ మాలిక్‌కు పటియాల కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. దాంతో పాటు రూ. 10 లక్షల జరిమానా కూడా విధించింది.యావజ్జీవం అంటే ఈ కేసులో 14 ఏళ్లు కాదు. చనిపోయేంత వరకు అని న్యాయమూర్తి స్పష్టంగా చెప్పారు.కశ్మీర్ ఉగ్రవాదం కోసం యాసిన్ మాలిక్ అంతర్జాతీయ స్థాయిలో నెట్ వర్క్ ఏర్పాటు చేశాడు.
దీనిని ఎన్ఐఏ ఆధారలతో సహా కోర్టుకు సమర్పించింది. అంతేకాక, యాసిన్ మాలిక్ స్వయంగా కోర్టు ముందు తాను చేసిన నేరాలను ఒప్పుకున్నాడు. దాంతో ఎన్ఐఏ యాసిన్ మాలిక్‌కు ఉరిశిక్ష వేయాలని కోరగా, న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ మాత్రం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. అయితే విచిత్రంగా యాసిన్ తాను గాంధేయ వాదినని, ఆ మార్గంలోనే పోరాటం చేశానని చెప్పుకోవడం గమనార్హం. కోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ, కాశ్మీర్లలో ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టారు. కాశ్మీర్లో బుధవారం బందు పాటించారు. కాగా, ఈ శిక్షను పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ ఖండించాడు. ఈ విషయంలో పాక్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తాలని సూచించాడు. కాగా, ఇదే కేసులో యాసిన్‌తో పాటు లష్కర్ ఏ తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుదు సయ్యద్ సలావుద్దీన్ పేర్లు కూడా ఛార్జ్‌షీట్ ఉన్నాయి. కానీ వారు ప్రస్తుతం పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నారు.