కండలు పెరిగేందుకు ఇంజెక్షన్‌లా.. అయితే మీకు ముప్పు తప్పదు - MicTv.in - Telugu News
mictv telugu

కండలు పెరిగేందుకు ఇంజెక్షన్‌లా.. అయితే మీకు ముప్పు తప్పదు

October 1, 2022

నేటి యువకులు అమ్మాయిలను ఆకర్షించడానికి కండరాలు తిరిగిన దేహం కావాలనుకుంటున్నారు. దానికోసం జిమ్‌కి వెళ్లి తీవ్ర కసరత్తులు చేస్తుంటారు. అయితే మరోవైపు ఇంత కష్టపడడం ఎందుకు? ఇంజెక్షన్లు తీసుకుంటే అదే బాడీ వస్తుంది కదా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కొంత మంది జిమ్ ట్రైనర్లు కూడా ఈ విధమైన సలహాలు ఇస్తున్నారు. ఇంజక్షన్ తీసుకుంటే ఇన్‌స్టంట్ ఫలితం ఉండడం వల్ల కష్టపడడం నచ్చని వాళ్లు దీన్ని సులువైన మార్గంగా ఎంచుకుంటున్నారు.

అయితే ఈ ఇంజెక్షన్లు అతిగా వాడితే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దేహ దారుఢ్యం కోసం వాడే మెఫెంటెర్మైన్ ఇంజెక్షన్లు యాంటీ హైపోటెన్సివ్స్ కేటగిరీలోకి వస్తాయి. లో బీపీ ఉన్నవారికి చికిత్స సమయంలో వీటిని ఉపయోగిస్తారు. ఆపరేషన్ సమయంలోనూ రోగి హార్ట్ బీట్‌ను సాధారణ స్థితికి తెచ్చేందుకు కూడా ఈ ఇంజెక్షన్లను వాడతారు. కానీ, బాడీ బిల్డింగ్ కోసం సుదీర్ఘ కాలం వాడడం వల్ల హైబీపీ, చర్మంపై దుద్దర్లు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది, మగత, నిద్రలేమి, వికారం, వాంతులు, బలహీనత, కొన్నిసార్లు గుండె పోటుతో మరణించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. మోతాదు మించితే హృదయ స్పందనలు దెబ్బతింటాయని వివరిస్తున్నారు. ఇటీవల డ్రగ్స్ అధికారులు పుణెలోని జిమ్‌లపై దాడులు నిర్వహించగా, 246 ఇంజెక్షన్లు దొరికాయి. ఈ ఇంజెక్షన్ ఒక్కోటి ధర రూ. 299 అయితే జిమ్ నిర్వాహకులు రూ. వెయ్యి చొప్పున విక్రయిస్తున్నారని తేలింది. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వీటి విక్రయం, వాడకం ఉండాలని, మెడికల్ ప్రాక్టీషనర్లే ఇంజెక్ట్ చేయాలని నిపుణులు వివరిస్తున్నారు.