పెళ్లిలో లిఫ్ట్ తెగిపడి విద్యార్థి బలి - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లిలో లిఫ్ట్ తెగిపడి విద్యార్థి బలి

May 14, 2022

కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేందుకో లేక తన చదువు ఖర్చుల కోసమో ఓ యువకుడు చేస్తున్న క్యాటరింగ్ వర్క్ చివరకు అతడి చావుకి కారణమైంది. పెళ్లి వేడుకలో క్యాటరింగ్ పనికి వెళ్లిన కుర్రాడు.. ఫంక్షన్ హాల్ నిర్లక్ష్యానికి బలయ్యాడు. ఈ విషాద సంఘటన చెన్నైలోని తిరువళ్లూరు గుమ్మిడిపూండిలో చోటుచేసుకుంది. పెళ్లి జరుగుతున్న కల్యాణ మండపంలో అతిథులకు లంచ్‌ ఏర్పాటు చేస్తున్నారు క్యాటరింగ్ సిబ్బంది.

భోజనాలకు సంబంధించిన వస్తువులను లిఫ్ట్‌లో పైకి చేరుస్తుండగా..ఒక్కసారిగా లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో అమాంతం కింద పడింది. మరికొన్ని సెకన్లలో లిఫ్ట్ నుంచి దిగుతారనగా.. అంతలోనే ప్రమాదం జరిగింది. లిఫ్ట్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనతో అక్కడున్న వారంతా లిఫ్ట్‌లో ఉన్నవారిని రక్షించేందుకు కిందికి పరుగులు పెట్టారు. వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

ఐతే అప్పటికే ఒకరు మృతి చెందగా..గాయపడిన ముగ్గురికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. చనిపోయిన యువకుడు 11వ తరగతి చదువుతున్నాడని.. పార్ట్ టైమ్ జాబ్ కింద క్యాటరింగ్ వర్క్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఆ లిఫ్ట్‌కి గేట్ లేని విషయం స్పష్టంగా కనిపిస్తుంది. లిఫ్ట్ వైర్ తెగిపోయిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సరైన నిబంధనలు పాటించని కారణంగా కళ్యాణ మండపం యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.