పామాయిల్ ఎగుమతిపై నిషేధం ఎత్తివేత..తగ్గనున్న ధరలు - MicTv.in - Telugu News
mictv telugu

పామాయిల్ ఎగుమతిపై నిషేధం ఎత్తివేత..తగ్గనున్న ధరలు

May 20, 2022

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైన రోజు నుంచి ఈరోజు వరకు అన్ని వస్తువులపై క్రమ క్రమంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో మార్కెట్‌కు వెళ్లిన సామాన్యులు.. పెరిగిన ధరలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక, వంట నూనెల ధరల విషయంలో చెప్పనవసరం లేదు. ప్రస్తుతం మార్కెట్లో లీటర్ ధర ప్రస్తుతం రూ.160 నుంచి రూ.230 వరకు ఉంది. పామాయిల్, సన్‌ప్లవర్ వంటి నూనెలకు ధరలు అమాంతంగా పెరిగిపోవడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇటువంటి సమయంలో ఇండోనేషియా శుభవార్త చెప్పింది. పెరిగిన వంట నూనెల ధరలు అతి త్వరలోనే దిగి రానున్నాయని తెలిపింది.

ప్రపంచ దేశాలకు పామాయిల్‌ను దిగుమతి చేస్తున్నా ఇండోనేషియా దేశం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పామాయిల్ ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని నిర్ణయించినట్లు ఆ దేశాధ్యక్షుడు జోకో విడొడొ తెలిపారు. ఈ నిర్ణయం గనుక అమల్లోకి వస్తే, పామాయిల్ ఎగుమతులు మళ్లీ జోరందుకోనున్నాయి. ఆయిల్ ధరలు క్రమ క్రమంగా దిగి రానున్నాయి.

ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న పామాయిల్‌లో ఇండోనేషియా, మలేషియాల నుంచే 85 శాతం వస్తోంది. తమ దేశంలో పెరిగిపోతున్న నూనె కొరతను నివారించి, ధరలకు ముకుతాడు వేసేందుకు ఇండోనేషియా ఎగుమతులను నిషేధించి, తిరిగి ఎగుమతులకు అనుమతులు ఇవ్వడంతో నూనె ధరలు మళ్లీ దిగి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు.