భారత్‌లో కరోనా ఆంక్షలు ఎత్తివేత: కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కరోనా ఆంక్షలు ఎత్తివేత: కేంద్రం

March 23, 2022

9

కేంద్ర హూం శాఖ కరోనా విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో మార్చి 31 నుంచి కొవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు బుధవారం వెల్లడించింది. కానీ మాస్క్, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధన మాత్రం తప్పనిసరిగా కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు.

ఈ సందర్భంగా హోంశాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. “కరోనా పరిస్థితుల్లో మెరుగుదలతో పాటు మహమ్మారిని ఎదుర్కోడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా తమ సామర్థ్యాన్ని పెంచుకొని సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. అటు కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఓ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ కట్టడికి విపత్తు నిర్వహణ చట్టం కింద ఉన్న నిబంధనలు మరింతకాలం పొడగించాల్సిన అసవరం లేదని భావిస్తున్నాం. మార్చి 31న ప్రస్తుతమున్న ఆంక్షల గడువు ముగియనుంది. ఆ తర్వాత హోంశాఖ ఎలాంటి కొత్త ఆదేశాలు జారీ చేయబోదు” అని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.