Lifting of restrictions on air ticket rates: Centre
mictv telugu

విమాన టికెట్ రేట్లపై పరిమితులు ఎత్తివేత: కేంద్రం

August 10, 2022

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో టికెట్ ధరలపై విధించిన గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను ఎత్తివేస్తూ, బుధవారం పౌర విమానయాన శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయంతో ఆగస్టు 31 తర్వాత విమానయాన సంస్థలే టికెట్ రేట్లను స్వచ్ఛందంగా నిర్ణయించుకుంటాయని పేర్కొన్నారు.

”21 మే 2022న టికెట్ రేట్లపై విధించిన అన్ని బ్యాండ్లపై గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను ఎత్తివేస్తున్నాం. దేశీయంగా విమానయాన కార్యకలాపాలు, విమాన ప్రయాణానికి ప్యాసింజర్ల డిమాండ్లు అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం ఆగస్టు 31, 2022 నుంచి అమల్లోకి వస్తుంది. కొవిడ్ ప్రొటోకాల్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. నిబంధనలను పకడ్బందీగా అమలుపరచాలి” పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలకు సూచించింది.

అయితే, ఈ నిర్ణయంపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా స్పందించారు. ”విమాన ఇంధనం, డైలీ డిమాండ్ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన అనంతరమే టికెట్ ధరలపై పరిమితి ఎత్తివేయాలని నిర్ణయించాం. విమానయాన రంగంలో స్థిరత్వం వచ్చింది. భవిష్యత్‌లో వృద్ధి ఖాయం” అని ఆయన అన్నారు.

అనంతరం విమాన ప్రయాణికులతోపాటు ఎయిర్‌లైన్స్‌కు కూడా ప్రయోజనకరమని ఏవియేషన్ నిపుణుడు పర్వీజ్ దమానియా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టికెట్ రేట్లు తగ్గి ప్రయాణికులకు ఉపశమనం దక్కుతుందని సరిన్ అండ్ కో కంపెనీ కార్యకలాపాల హెడ్ వినమ్ర లొంగానీ ఆశాభావం వ్యక్తం చేశారు.