Liger Team Vijay Devarakonda, Ananya Panday travel in Mumbai metro
mictv telugu

లోకల్ ట్రైన్‌లో ‘లైగర్’ జంట.. అనన్య ఒడిలో విజయ్

July 29, 2022

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్‌. స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైక్ టైసన్‌కు మొట్టమొదటి ఇండియన్‌ సినిమా ఇదే. అదే సమయంలో విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. దీంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో బిజిబిజీగా గడుపుతోంది.

తాజాగా విజయ్‌, అనన్యలిద్దరూ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సందడి చేశారు.అక్కడివారితో తమ సినిమా గురించి ముచ్చటిస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం వీరిద్దరూ లోకల్‌ ట్రైన్‌లో ప్రయాణించారు. మాస్కులు ధరించి స్టేషన్‌కు చేరుకున్న వీరిద్దరూ ఫ్లాట్‌ఫామ్‌పైనే చాలాసేపు కూర్చొన్నారు. అనంతరం రైలెక్కిన వీరిద్దర్నీ అందులో ఉన్న ప్రయాణికులు గుర్తించి.. సరదాగా ముచ్చటించారు. అభిమానులతో మాట్లాడి ఆలసిపోయాడో ఏమో గానీ విజయ్ కొద్దిసేపు అనన్య ఒడిలో పడుకొని కునుకు తీశాడు. ఈ ఫొటోలను అనన్య సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘లైగర్ ప్రమోషన్స్‘ట్రాక్’లో ఉన్నాయి. లెట్స్ గో బాయ్స్’ అని పేర్కొంది.

ప్రస్తుతం ఈ వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘లైగర్‌’ కోసం విజయ్‌-అనన్య మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమాలో విజయ్‌.. ముంబయి స్లమ్‌ ఏరియాకు చెందిన యువకుడిగా మాస్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఛార్మి, కరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. sx