Light rains till 19 in Telangana..reduced intensity
mictv telugu

తెలంగాణలో 19 వరకు తేలికపాటి వానలు..తగ్గిన తీవ్రత

July 16, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాల తీవత్ర తగ్గిందని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో 8 జిల్లాల్లో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయని, ప్రస్తుతం ఒడిశా తీర ప్రాంతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్న కారణంగా, రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

విడుదల చేసిన ప్రకటనలో.. ”నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, మెదక్, కామా రెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అతి భారీ వర్షాల తీవ్రత తప్పింది. ఈ నెల 19వరకు తేలికపాటి వర్షాలే కురుస్తాయి” అని పేర్కొంది.

‘ఇక, భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చిందని, శుక్రవారం సాయంత్రానికి నీటి ప్రవాహం 71 అడుగులకు చేరుకొందని అధికారులు తెలిపారు. దీంతో 22 ఏండ్ల క్రితం 1990లో వచ్చిన 70.8 అడుగుల వరద రికార్డును తాజా వర్షాలు బద్దలుకొట్టాయని పేర్కొన్నారు. అంతేకాదు, ఎగువన ఉన్న పరిస్థితులను చూస్తుంటే 77 అడుగులు దాటి, కొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉందని, ప్రస్తుతం ఎగువ నుంచి భారీగా ప్రవాహం కొనసాగుతుండడంతో ఎగువన లక్ష్మీ బరాజ్ నుంచి 22.82 లక్షల క్యూసెక్కులు, సమ్మక్క బరాజ్ నుంచి 23.80 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరాలను వెల్లడించారు.