మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దుల వివాదం ముదురుతోంది. బెళగావి ప్రాంతంపై ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.సరిహద్దుల్లో భారీగా పోలీసులును మోహరించారు. ఇలాంటి సమయంలో శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా మాదిరిగా తాము కూడా కర్ణాటకలోకి అడుగుపెడతామన్నారు.. ఈ అంశంపై తమకు ఎలాంటి అనుమతి అవసరం లేదని చెప్పారు. చర్చల ద్వారా పరిస్థితి సద్ధుమణిగేటట్లు కనపించడం లేదని చెప్పారు. చర్చలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధంగా లేరని.. ఆయన గొడవలకు మరింత ఆజ్యం పోస్తున్నారని సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మహారాష్ట్రలో బలహీన ప్రభుత్వం ఉండటం వల్లే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోందని అన్నారు.
గత కొంత కాలంగా బెళగావి ప్రాంతంపై కర్ణాటక-మహారాష్ట్ర మధ్య గొడవలు జరగుతున్నాయి. బెళగావిని మహారాష్ట్రలో కలపాలని వారు డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. మహారాష్ట్ర నుంచి వెళ్లిన శివసేన నేతలను కర్ణాటక పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రస్తుతం ఈ సరిహద్దు వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. ఇలాంటి సమయంలో సంజయ్ రౌత్ చైనా తరహాలో కర్ణాటకలోకి అడుగుపెడతాం అని వ్యాఖ్యానించడం వివాదంగా మారింది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లోని సరిహద్దు వద్ద భారత్-చైనా సైనికులు ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో పోలుస్తూ.. చైనాలా కర్ణాటకలో అడుగుపెడతామని సంజయ్ రౌత్ కామెంట్ చేశారు.