రాజశేఖరరెడ్డిలా చచ్చిపోతా.. కొడాలి నాని - MicTv.in - Telugu News
mictv telugu

రాజశేఖరరెడ్డిలా చచ్చిపోతా.. కొడాలి నాని

January 20, 2020

Kodali Nani,.

‘వైఎస్ఆర్ మరణం కనుక నాకొస్తే… నాకు ఆ మరణమే కావాలని దేవుడ్ని కోరుతాను’ అని ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో కొంతమందిని పోగేసి జగన్ కుటుంబాన్ని, ఆయన తండ్రిని విమర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్‌లా చనిపోయినా బతికున్న అదృష్టం ఎంతమందికి వస్తుందని ప్రశ్నించారు. వైఎస్ఆర్‌ది చాలా గొప్ప మరణమని తెలిపారు. ‘ఆయన చనిపోయినా ప్రజల గుండెల్లో బతికే ఉన్నారు.  వైఎస్ఆర్ పేరుమీద పార్టీ స్థాపిస్తే… కడప జిల్లాలో డిపాజిట్లు కూడా ఇతర పార్టీకి దక్కకుండా జగన్ మెజార్టీతో గెలిచారు. వైఎస్ చేసిన కార్యక్రమాలే ఈరోజు జగన్‌ను గెలిపించాయి. రాజశేఖర్ రెడ్డి మరణంపై విమర్శలు చేస్తున్నవారు సన్నాసులు. జగన్ మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు. రాజధాని రైతులకు, మహిళలకు ఏమైనా అనుమానాలుంటే.. జగన్‌ను వచ్చి కలవాలి. ఆయనది ఎంతో పెద్ద మనసు. తప్పకుండా మీ కష్టాల్ని విని మీకు న్యాయం చేస్తారు’ అని కొడాలి నాని అన్నారు.

అమరావతియే రాజధానిగా ఉండాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటే.. 21మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. మీరంతా రాజీనామా చేసి దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి అన్నారు. పిచ్చి అరుపులు అరవకండి అంటూ టీడీపీ సభ్యులపై కొడాలి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా కలిసి ముందు కొడాలి నానీయే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అందుకు నాని సెటైర్ వేశారు. మేమంతా రాజీనామా చేస్తే వాళ్లు మిగులుతారా అంటూ ఎద్దేవా చేశారు.