Lingayat abbot arrested in case of sexual assault on girls
mictv telugu

బాలికలపై లైంగిక దాడి కేసులో లింగాయత్ మఠాధిపతి అరెస్ట్

August 29, 2022

కర్ణాటక రాజకీయాలపై అవగాహన ఉన్నవారెవరికైనా అక్కడి మఠాల ప్రాబల్యం తెలిసే ఉంటుంది. మఠాధిపతులు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అంతలా రాజకీయంగా ప్రాబల్యం పెంచుకున్న మఠాలలో ముఖ్యమైనవి లింగాయత్‌లు. వీరి జనాభా, పలుకుబడి ఎక్కువగా ఉండడంతో వీరు మద్ధతు ఇచ్చిన వారే ముఖ్యమంత్రిగా ఎన్నికవడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి మఠాల్లో చిత్రదుర్గకు చెందిన మురుగ మఠం. ఈ మఠాధిపతి శివమూర్తి మురుగా శరణు తాజాగా మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసులో చిక్కుకున్నారు. మఠానికి అనుబంధంగా ఉండే హైస్కూలులో చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలపై మఠాధిపతి లైంగిక దాడికి పాల్పడ్డారని బాలికలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సోమవారం శరణును తమ నిర్భంధంలోకి తీసుకున్నారు. అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోక్సో వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మఠాధిపతితో పాటు పాఠశాల వార్డెన్ సహా నలుగురిపై కూడా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు 15, 16 ఏళ్ల మైనర్ బాలికలు లైంగిక దాడి విషయాన్ని ఫిర్యాదు రూపంలో తెలియజేశారు. మూడున్నరేళ్లుగా అనేక మంది బాలికలపై లైంగిక దాడి చేస్తున్నారంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీఎం బొమ్మై.. కేసు విచారణలో ఉన్నందున ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవుతుందని పేర్కొన్నారు. అటు బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప స్పందిస్తూ.. చిత్రదుర్గ మఠం రాష్ట్రంలో చాలా పేరున్నదని, ఈ వార్త నిజం కాకూడదని కోరుకుంటున్నామన్నారు. విచారణలో ఏది తేలితే దానిని అంగీకరించేందుకు సిద్ధమని ప్రకటించారు.