కర్ణాటకలో బీజేపీకి దెబ్బ.. లింగాయతులు హిందువులు కారు.. - MicTv.in - Telugu News
mictv telugu

కర్ణాటకలో బీజేపీకి దెబ్బ.. లింగాయతులు హిందువులు కారు..

March 19, 2018

కర్ణాటక లింగాయతుల పోరాటం ఫలించింది. వారిని హిందువులుగా కాకుండా వేరే మతం వారిగా గుర్తించేందుకు సిద్ధరామయ్య కేబినెట్ అంగీకరించింది. సంబంధింత ప్రతిపాదనను సోమవారం ఆమోదించింది. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ వర్గం వారి ఓటుబ్యాంకు కోసం సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆరెస్సెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హిందూమతాన్ని చీల్చే కుట్రలో ఇది భాగమని ఆరోపిస్తోంది.లింగాయతుల డిమాండ్‌పై అధ్యయనం కోసం ప్రభుత్వం గతంలో జస్టిస్ నాగమోహన్ దాస్ కమిటీ వేసింది. నివేదికను పరిశీలించాక వారికి వారిని ప్రత్యేక మతం వారిగా గుర్తించేందకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని  లింగాయత్ నేత, మంత్రి ఎంబీ పాటిల్ చెప్పారు. ‘మేం హిందువులం కాదు అని దశాబ్దాలుగా మొత్తుకుంటున్నాం. మా డిమాండుకు ఇప్పుడు అర్థవంతమైన ముగింపు లభించింది’ అని అన్నారు. 12వ శతాబ్దికి చెందిన సంస్కర్త బసవేశ్వరుని అనుచరులను లింగాయతులు అని అంటారు. హిందూ మతంలోని కులవివక్ష వంటి మూఢాచారాలను నిరసించిన తాము ఆ మతం కిందికి రామని, తమను లింగాయత్ అనో లేకపోతే వీరశైవ లింగాయత్ అనో పేర్కొన్నాలని డిమాండ్ చేస్తున్నారు.

చిక్కుల్లో బీజేపీ..

లింగాయతులు జనాభా రాష్ట్రంలో 18 శాతం వరకు ఉంది. వీరిని హిందూమతం వారిగా కాకుండా లింగాయత్ అనో మరొకటనో ప్రత్యేక మతంవారిగా గుర్తిస్తే బీజేపీ ఎన్నికల్లో నష్టపోయే అవకాశముంది. ప్రస్తుతం ఆ పార్టీకి ఈ వర్గం నుంచి గట్టి మద్దతే ఉంది. మాజీ సీఎం యడ్యూరప్ప కూడా లింగాయతే.