ఆకలికి తట్టుకోలేక గడ్డి తిన్న సింహం..వీడియో
సింహం అంటే అడవికి మృగరాజు.. సింహం ఆకలేస్తే గడ్డి తినదు మాంసం మాత్రమే తింటుంది అంటారు. కానీ, గుజరాత్‌లోని గిర్ అభయారణ్యంలో మాత్రం సింహం గడ్డి తింటూ కెమెరాలో చిక్కింది. ఆ అడవిలో జంతువులకు ఆహారం అందక బక్కచిక్కిపోతున్నాయి. ఆకలికి తట్టుకోలేక మూగజీవులు అల్లాడిపోతున్నాయి. అనేక జంతువులు నీళ్ల కోసం, ఆహారం కోసం జనజీవనంలోకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గిర్ అభయారణ్యంలో ఓ సింహం గడ్డిని తింటూ కనిపించింది. ఆకలి బాధను తట్టుకోలేక ఇలా గడ్డి తింటున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలు నెటిజన్ల హృదయాలను కలచివేస్తోంది. ఇప్పటికే సరైన ఆహారం లేక, ఇతర కారణాల వల్ల 2016-17 సంవత్సర కాలంలో దాదాపు 200 సింహాలు మృత్యువాత పడ్డాయని ప్రభుత్వ నివేదికలో తేలింది. అయినా కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే జంతువులకు సరైన ఆహార ఏర్పాట్లు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.