రైతుకు దారి వదిలిన సింహం.. మనిషికి గుణపాఠం - MicTv.in - Telugu News
mictv telugu

రైతుకు దారి వదిలిన సింహం.. మనిషికి గుణపాఠం

February 3, 2020

Lioness.

మనుషులు మృగాలుగా మారుతుంటే మృగాలు మాత్రం స్వచ్ఛమైన మానవత్వంతో వ్యవహరిస్తున్నాయి. మన దారికి ఎవరైనా అడ్డమొస్తే చికాకపడతాం, తిడతాం. అవతలి వాడికి నోరు లేకపోతే మన నోరు పెరుగుతుంది. అతడు బలహీనుడైతే మన చెయ్యి కూడా లేస్తుంది. ఇప్పుడు  చూడబోయే సీన్ మనకు గుణపాఠం నేర్పుతుంది. 

సింహం  ఒక క్రూర జంతువు.. పీక్కు తింటుంది. దానికి జాలి, కరుణలు వంటివి తెలియవని అని అనుకుంటాం.  కానీ వాటిలో కూడా విచక్షణ ఉంటుందని మనకు తెలియదు. ఈ వీడియో చూస్తే వారెవ్వా సివంగి అంటారు. గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యంలో వెలుగుచూసిన ఈ అరుదైన దృశ్యం మాత్రం క్రూర జంతువులు కూడా విచక్షణతో మసలుకుంటాయని నిరూపించింది. 

తన రెండు పిల్లలతో కలిసి అడవిలో దారి గుండా వెళ్తోంది ఓ ఆడ సింహం. అసలే పిల్లల తల్లి.. జంతువుల్లో పిల్లల తల్లికి చాలా కోపం ఉంటుంది. తన పిల్లల జోలికి ఎవరు వస్తారా అని చాలా అప్రమత్తంగా, ఆగ్రహంగా ఉంటుంది. అది వెళ్తున్న అదే దారిలో బైక్‌పై ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి వచ్చాడు. చచ్చాన్రా సామీ అనుకున్న అతని గుండెలు అదిరాయి. వెనక నుంచి చూస్తున్నవారు కూడా అతనిపైకి పంజా విసురుతుందని భయంగా వీడియో తీస్తున్నారు. కానీ, ఆ సివంగి ఆ పని చేయలేదు. తనలోకి క్రూరత్వాన్ని అప్పుడు అస్సలు ప్రదర్శించలేదు. అతనికి దారి ఇస్తూ తన పిల్లలను వెంటబెట్టుకుని తన దారిన తాను వెళ్లిపోయింది. 

దీంతో ఇదెక్కడి సివంగిర నాయనా అనుకుని వారు అక్కడినుంచి వైదొలిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. రాజ్యసభ ఎంపీ పరిమల్‌ నాథ్వాని దీనిని ట్వీట్ చేస్తూ.. ‘ఈ వైరల్‌ వీడియో చూడండి. పిల్లలతో కలిసి అడవిలో వెళ్తున్న ఓ ఆడసింహం.. సమీప గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై రావడంతో దారి ఇచ్చింది. మనుషుల జీవన విధానానికి జంతువులు ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తాయి. ఇదెంతో అద్భుతంగా ఉంది’అని క్యాప్షన్‌ జోడించి షేర్ చేశారు.