లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా ! - MicTv.in - Telugu News
mictv telugu

లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా !

July 24, 2017

జూలై 21 న రిలీజైన హిందీ సినిమా ‘ లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా ’ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎన్నో నేషనల్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ సినిమా అవార్డులు గెలుచుకుంది. తొలుత ఈ సినిమాపై చాలా విమర్శలు వచ్చాయి. సెన్సార్ నుండి కూడా చాలా కత్తెరలు పడ్డ తర్వాత ‘ ఎ ’ సర్టిఫికేట్ తో రిలీజైంది. బుర్ఖా మాటున స్త్రీ స్వేచ్ఛ ఏ విధంగా అణిచివేయబడుతోందనేది నాలుగు క్యారెక్టర్ల ద్వారా చూపించారు ఈ సినిమాలో. ఎన్నో ప్రశ్నలు పురుష భావజాలం మీద సంధించబడ్డాయి. అలంకృతా శ్రీవాస్తవ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆరున్నర కోట్ల బడ్జెట్లో నిర్మితమైంది. రెండో రోజే దిమ్మ దిరిగే కలెక్షన్లతో హిట్ టాక్ ను సొంతం చేస్కుంది. కొంకణా సేన్ శర్మా, రత్నా పాఠక్, ఆహానా కుమ్రా, ప్లబితా బోర్తకూర్ లు ప్రధాన పాత్రల్లో అద్భుతంగా నటించి వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. ముఖ్యంగా రత్నా పాఠక్ పాత్ర చాలా మంది ప్రేక్షకులను అలరించిందనే చెప్పుకోవాలి.

యాభై ఏళ్ళ విడోగా తను యవ్వనంలో బుర్ఖా మాటునుండి కోల్పోయిన స్వేచ్ఛను వెతుక్కునే క్రమంలో సమాజం నుండి ఎన్నో అవమానాలను ఎదుర్కుంటుంది. ఇలా నాలుగు పాత్రలకు నాలుగు నేపథ్యాలుంటాయి. ప్రతీ పాత్ర ఆలోచింపజేస్తుంది. పురుషహంకారం మీద ఈ బుర్ఖా మాటున లిప్ స్టిక్ సినిమా చాలా గట్టిగా బాణం సంధిస్తుంది. అక్కడక్కడా కొన్ని ఇబ్బందికర సన్నివేశాలున్నా చిత్రం చూసిన ప్రతీ ఒక్కరినీ కదిలిస్తుంది.