ఆన్‌లైన్లో మందు ఆర్డర్ చేస్తే ఇంటి ముందు… ప్రియమైన వైన్‌షాప్... - MicTv.in - Telugu News
mictv telugu

ఆన్‌లైన్లో మందు ఆర్డర్ చేస్తే ఇంటి ముందు… ప్రియమైన వైన్‌షాప్…

November 21, 2018

పాపం మందుబాబులు మద్యం సేవించి ఇంటికి వద్దామంటే డ్రంకెన్ డ్రైవ్ అంటూ పోలీసులు వాళ్లను పట్టుకుని బొక్కలో తోస్తారు. తాగుబోతులకు ఇది నిత్యం తలనొప్పిగా మారింది. తాగినదానికి ఎక్కువ ఫైన్ పోలీసులకు చెల్లిస్తూ కుయ్యోమొర్రో అన్నారు. దీన్నుంచి తప్పించుకోవడం ఎలా అనుకున్నారు పాపం. ఈ క్రమంలో వారి మనోవేదనను ఓ వైన్ షాపు అర్థం చేసుకుని వారికి ఓ బంపర్ ఆఫన్ ప్రకటించింది. అదే ఆన్‌లైన్లో మందు ఆర్డర్ చేస్తే, ఇంటికే మందును డోర్ డెలువరీ చేయడం. ఈరోజుల్లో ఆన్ లైన్లో ఏ టు జెడ్ అన్నీ దొరుకుతున్నాయి. మందు దొరికితే పాపమేంటి అనుకున్నట్టున్నారు సదరు ‘దీపక్  వైన్స్’ షాపువాళ్లు. అందుకే ఈ కొత్త ఉపాయానికి తెరలేపారు. ‘అడ్వాన్స్ చెల్లించండి… కావల్సినంత మద్యం మీ ఇంటికే పంపిస్తాం…’ అని ఆన్ లైన్లో ప్రకటనలు గుప్పించింది. ఈ క్రమంలో లిక్కర్ డోర్ డెలెవరీకి విపరీతమైన డిమాండ్ పెరిగింది.Liquor Home Delivery in Mumbai ఇంకే మందుబాబులకు దీన్ని మించిన గొప్ప ఆఫర్ ఇంకోటి వుండదనుకున్నారు. ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని ఫూటుగా మందుకొట్టి ఎన్ని తందనాలు ఆడినా పట్టుకునే పాపాత్ముడు వుండడని ఆర్డర్ల మీద ఆర్డర్లు చేయసాగారు. అలా ఆ వైన్ షాపు బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతోంది. ఇంతకీ మందుబాబులకు అత్యంత ప్రియమైన ఆ వైన్ షాప్ ఎక్కడుందంటే.. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో. బాంద్రా ప్రాంతం తాగుబోతులను చూసి ఇతర ప్రాంతాల తాగుబోతులు కుళ్ళుకునే పరిస్థితి నెలకొంది. దీనిపై మందు పడని మహానుభావులు సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టడంతో ఈ ఆలోచనను విరమించుకుంది.

ఈవార్త ఈనోటా ఆనోటా చేరాల్సిన చోటకి చేరింది. ఇంకే అనుమతి లేకుండా నిబంధనలకు వ్యతిరేకంగా మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్న ఆ వైన్‌షాప్‌ను ఎక్సైజ్ శాఖ అధికారులు పక్కా ఆధారాలతో దాడులు చేసి సీజ్ చేశారు. వైన్స్ యాజమాన్యానికి 18.9 లక్షల రూపాయల జరిమానా విధించారు. అంతేకాకుండా 11 లక్షల రూపాయల లిక్కర్ విక్రయాల గురించి లెక్కలు చూపించకపోవడంతో షాప్‌ను సీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పాపం బాంద్రా తాగుబోతులు లబోదిబోమనక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇదిలావుంటే కొన్నాళ్ల క్రితం మహారాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని డోర్ డెలివరీ చేయాలనే ఆలోచన చేసింది. ఉప్పు దగ్గర్నుంచి ప్రతీ వస్తువుని ఆన్‌లైన్‌లో కొనుక్కునే సదుపాయం వచ్చినప్పుడు మద్యాన్ని ఆన్‌లైన్ ద్వారా అమ్మితే తప్పేంటని భావించింది. ప్రభుత్వ మాటని నిజం చేయాలనుకుని నిప్పులో కాలు పెట్టినంత పనిచేసింది దీపక్ వైన్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.