సంపూర్ణ మద్యనిషేధం దిశగా చర్యలు తీసుకుంటున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మందుబాబులకు కొంత ఊరట కల్పించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భారీగా ఉన్న మద్యం ధరలను తగ్గించారు. తెలంగాణ, తమిళనాడు నుంచి అక్రమ మద్యం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఐఎమ్ఎఫ్ లిక్కర్, ఫారిన్ లిక్కర్ ధరలను ఏపీ ప్రభుత్వం సవరించింది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. సవరించిన ధరల వివరాలను కూడా విడుదల చేసింది. రూ. 50 నుంచి రూ.1,350 వరకు వివిధ కేటగిరీల బ్రాండ్లపై మద్యం ధరలు కొంతమేర దిగొచ్చాయి. బీర్లు, రెడీ టూ డ్రింక్స్ ధరలను మాత్రం సవరించలేదు. ఇతర రాష్ట్రాలనుంచి మూడు బాటిళ్లను తెచ్చుకోవచ్చన్న ఏపీ సర్కారు తర్వాత మాట మార్చడం తెలిసిందే. పర్మిట్లు ఉన్నవారే తెచ్చుకోవాలని, వాటికి పన్ను కూడా కట్టాలని ఆదేశాలు జారీచేసింది.