Liquor sales increased last Month in telangana even the price is increased
mictv telugu

తగ్గేదే లే.. ధరలు పెరిగినా జోరుగానే మద్యం అమ్మకాలు

June 20, 2022

Liquor sales increased  last Month in telangana even the price is increased

సీజన్‌తో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ధరలు పెరిగినా తాగే విషయంలో మద్యం ప్రియులు వెనుకడుగు వేయట్లేదు. కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా గత నెల మే 19న మద్యం ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. బీరుపై రూ.10, ఆర్డినరీ క్వార్టర్‌పై రూ.20, ప్రీమియం క్వార్టర్‌పై రూ.40 చొప్పున పెంచారు. ఇక చీప్‌ లిక్కర్‌ క్వార్టర్‌ అయితే రూ.95 నుంచి రూ.120కి పెంచేశారు. మొత్తం మద్యం విక్రయాల్లో 40-50 శాతం అమ్ముడుపోయేది చీప్ లిక్కర్ క్వార్టరే. దీంతో మద్యం ప్రియులు కాస్త వెనుకడుగు వేస్తారేమో అని అధికారలు భావించారు. కానీ, అంతకుముందు నెలతో పోల్చితే ధరలు పెంచిన తర్వాతి నెల రోజుల్లో ఏకంగా రూ.530 కోట్లకుపైగా ఎక్కువ అమ్ముడుపోయినట్లు వెల్లడైంది.

ధరలు పెరగకముందు నెల రోజుల్లో అంటే ఏప్రిల్‌ 19 నుంచి మే 18 వరకు రాష్ట్రంలో రూ.2,800.31 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. 28,37,109 కేసుల లిక్కర్‌, 54,74,733 కేసుల బీర్లు విక్రయించారు. ధరలు పెరిగిన తర్వాత అంటే మే 19 నుంచి జూన్‌ 18 వరకు రూ.3,330.74 కోట్ల మేర విక్రయాలు జరిగాయి. 30,52,184 కేసుల లిక్కర్‌, 57,36,884 కేసుల బీరు అమ్ముడుపోయింది.

తెలంగాణలో మద్యం అమ్మకాల విషయంలో రాష్ట్రం అంతా ఒక ఎత్తైతే ..రంగారెడ్డి జిల్లాను స్పెషల్‌గా చెప్పుకోవాలి. హైదరాబాద్‌లో సగం రంగారెడ్డి జిల్లాలో ఉండటం, శివార్లలో చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు, పరిశ్రమలతో పాటు రియలెస్టేట్ వ్యాపారం జోరుగా ఉంటుంది. అలాగే ఈ జిల్లాలో నివసించే జనాభా సంఖ్య కూడా ఎక్కువే. దీనికి తోడు శంషాబాద్ విమనాశ్రయం కూడా ఉండటంతో మద్యం విక్రయంలో రంగారెడ్డి జిల్లా టాప్‌ ప్లేస్‌లో నిలవడానికి ఒక కారణమైంది.