కంపు కొట్టే చెత్త హోం డెలివరీ.. ఎందుకంటే! - MicTv.in - Telugu News
mictv telugu

కంపు కొట్టే చెత్త హోం డెలివరీ.. ఎందుకంటే!

September 19, 2020

Litter home delivery Bangkok Thailand

డోర్ బెల్ మోగింది. ఇంటికి పార్సిల్ వచ్చింది. యజమాని ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని డబ్బా చూసుకుకున్నాడు. తర్వాత విప్పి చూసి ‘థూ.. యాక్’ అన్నాడు. డబ్బాలోని ఉత్తరం తీసి చదివి సిగ్గుతో చితికిపోయాడు. ప్రముఖ పర్యాటక నగరం బ్యాంకాక్‌లో చాలామందికి ఎదురవుతున్న అనుభవం ఇది. పార్కుల్లో, పర్యాటక ప్రాంతాల్లో విచ్చలవిడిగా చెత్తను పారేస్తున్న వారికి అధికారులు ఇలాంటి శిక్ష విధిస్తున్నారు. 

హెచ్చరికలు, జరిమానాలు పనిచేయకపోవడంతో.. ఎవరు పడేసిన చెత్తను వారి ఇంటికే హోం డెలివరీ చేస్తున్నారు. ఖావో యాయ్ నేషనల్ పార్క్ అధికారులు ఈ తతంగం ప్రారంభించారు. సీసీ కెమెరాలు, ఫోన్ నంబర్లు, ఇతరత్రా ఆధారాలను సేకరించి నిందితులను అడ్రస్ కనిపెడుతున్నారు. తర్వాత వారు పారేసిన చెత్తను సేకరించి శుభ్రంగా ప్యాక్ చేసి హోం డెలివరీ చేస్తున్నారు. ‘ఇది మీరు మరిచిపోయి విలువైన చెత్త. దయచేసి స్వీకరించగలరు. ధన్యవాదాలు.. ’ అని రాసి వెంటకారంగా రాసిన లెటర్లు కూడా డబ్బాల్లో పెడుతున్నారు. ఈ మంత్రం బాగానే పనిచేస్తోందని, పార్కులో చెత్త తగ్గిందని అధికారులు చెబుతున్నారు. డెలివరీ చేసిన చెత్త ఫోటోలను థాయ్‌లాండ్ పర్యాటక మంత్రి వరవుత్ శిల్పార్చ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు.