little girl holding Ganapati idol and Crying
mictv telugu

నా గణేషుడికి నిమజ్జనం వద్దంటూ క్యూట్‌గా ఏడ్చేసిన చిన్నారి.. వీడియో

September 10, 2022

వినాయక చవితి సందర్భంగా వివిధ రూపాల్లోని గణపతిని ప్రతిష్టించి పూజలు చేసి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. పూజించడం మొదులు నిమజ్జనం వరకు ఎంతో కోలాహలంగా ఈ వేడుక జరుపుకుంటారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా విగ్రహాల నిమజ్జనం పూర్తవగా, మరికొన్ని విగ్రహాలు అక్కడక్కడా ఉన్నాయి. అయితే ఓ చిన్నారి మాత్రం గణేషుడిని నిమజ్జనం చేయవద్దంటూ మారం చేసింది. విగ్రహాన్ని కౌగలించుకొని ఏడ్చేసింది. నిమజ్జనం సందర్భంగా ఈ వీడియో వైరల్ అవుతోంది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అందులో ఓ బుజ్జాయి విగ్రహాన్ని గట్టిగా పట్టుకొని వదిలేందుకు నిరాకరించింది. తల్లి వారిస్తున్నా వినకుండా కిందకు దిగలేదు. వినాయకుడి ఒళ్లో కూర్చుని తీసుకెళ్లనివ్వను అంటూ పట్టుబట్టింది. తర్వాత కాసేపటికి తల్లి పాపను వెనక్కి లాగి ఎత్తుకోగా, తర్వాత విగ్రహాన్ని నిమజ్జనం కోసం తరలించారు. ఈ భావోద్వేగ సన్నివేశాన్ని కెమెరాలో బంధించడంతో నెట్టింట వైరల్ అవుతోంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఉద్వేగ సన్నివేశాలు చోటుచేసుకోవడం జరుగుతూ ఉంటుంది. వినాయకుడి పట్ల ఇంత అపేక్షను పెంచుకోవడం, వదలనని మారాం చేయడం వీడియో చూసిన వారందరినీ ఆకట్టుకుంటోంది.