లామాలపై ఆశ..  కరోనాకు చెక్ పెట్టేస్తుందా?  - MicTv.in - Telugu News
mictv telugu

లామాలపై ఆశ..  కరోనాకు చెక్ పెట్టేస్తుందా? 

July 16, 2020

Llama Animal Antibody Treatment For Corona .

యావత్ ప్రపంచానికి  కరోనా వైరస్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మందు లేని రోగం కావడంతో శాస్త్రవేత్తలు విరుగుడు కోసం తలమునకలై పని చేస్తున్నారు. ఈ మహమ్మారి మొదటగా జంతువుల నుంచి సంక్రమించినట్టుగా ప్రచారం జరిగింది. ఓ దశలో గబ్బిలాల వల్లే వచ్చిందని చెప్పారు. 

వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని అన్నట్టుగా ఈ వైరస్‌కు జంతువుల ద్వారానే చెక్ పెట్టేందుకు పరిశోధకులు సిద్ధమయ్యారు. దీని కోసం  దక్షిణ అమెరికాలో కనిపించే లామా జంతువును ఎంచుకున్నారు. చిన్న దీని ద్వారా యాంటీబాడీలు సేకరించి వైరస్ కట్టడి చేయాలని పరిశోధనలు జరుగుతున్నాయి. ఇవి సక్సెస్ అయితే కరోనా చికిత్సలో కీలక ఘట్టం ఆవిష్కారం అయినట్టే.  అందుకే ఇప్పుడు వైద్య ప్రపంచంలో లామా అనే పేరు మారుమోగిపోతోంది.

లామా  జంతువు ప్రపంచంలోనే చాలా అరుదైనది. దక్షిణ అమెరికాలోని యాండీస్ పర్వతాల్లో ఇవి ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. కాబట్టి  చాలా మందికి వీటి గురించి పెద్దగా తెలియదు. ప్రస్తుతం ఉత్తరమెరికా, దక్షిణమెరికాలో పెంపుడు జంతువులుగా ఉన్నాయి.  ఒంటె జాతికి చెందిన లామాలను పాలు, మాంసం, ఉన్ని కోసం వాటిని పెంచుకుంటున్నారు. ఇటీవల బ్రిటిష్ పరిశోధకులు కరోనాను ఎదుర్కొనే విషయంలో వీటిపై ప్రయోగాలు చేయగా సానుకూల ఫలితాలు రావడంతో లామా రక్తం నుంచి తీసిన యాంటీబాడీలు  కోవిడ్ చికిత్సకు ఉపయోగపడతాయని అంటున్నారు. 

ఇంగ్లాండ్‌లోని రోసాలిండ్ ఫ్రాంక్లిన్ ఇనిస్టిట్యూట్ శాస్తవేత్తలు లామాలపై పరిశోధన జరిపారు. దీని కోసం  ఫిఫి అనే లామాను శాస్త్రవేత్తలు ఎంపిక చేశారు. ప్రమాద రహితంగా మార్చిన వైరస్‌ను ఫిఫి రక్తంలోకి ఎక్కించి  తెల్ల రక్తకణాలు విడుదల చేసిన యాంటీబాడీలను ల్యాబ్‌లే వేరు చేశారు. అవి వైరస్‌పై సమర్థవంతంగా పోరాడి వాటిని హతం చేశాయి. ఇవి మానవ రక్తంలోని యాంటీ బాడీలతో పోల్చితే చాలా పొందికైనవని  గుర్తించారు. దీంతో వీటి ద్వారా సేకరించిన యాంటీబాడీలతో కరోనా సోకిన వారికి వైద్యం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. 

వాస్తవానికి ఇది కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్లాస్మా థెరపీ లాంటిదే. కరోనా వైరస్ సోకి తర్వాత ఆరోగ్యవంతుడిగా మారిన మనిషి రక్తంలో యాంటీ బాడీలు సేకరించినట్టుగానే.. లామాల నుంచి కూడా యాంటీ బాడీలు సేకరిస్తారు. వాటిని రక్తం నుంచి వేరు చేసి మనిషికి ఎక్కిస్తే సమర్థవంతంగా పని చేస్తుందని చెబుతున్నారు. ఈ నానో బాడీస్ థెరఫి త్వరలోనే క్లినికల్ ట్రయల్స్‌కు వెళ్లనుంది. అనుకున్నట్టుగా సక్సెస్ అయితే మాత్రం లామాలతో కరోనాకు అడ్డుకట్ట పడినట్టే అని అంటున్నారు.