కరోనా కాటు.. అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితి - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా కాటు.. అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితి

March 25, 2020

West Bengal

కరోనా కాటుతో మనవ సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోతున్నాయి. ఎవరో తెలియని వ్యక్తి మరణిస్తేనే అయ్యే పాపం అంటూ ముందుకు వచ్చే ప్రజలు, సొంత బంధువులు చనిపోయినా పట్టించుకోవడంలేదు. కరోనాతో మరణించిన వారి వద్దకు వెళ్తే తమకు ఎక్కడ సోకుతుందోనని భయపడిపోతున్నారు. అలాటి వారిని సొంత కుటుంబ సభ్యులే దూరం పెడుతున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్‌లో మరణించిన ఓ 57 ఏళ్ల వ్యక్తికి ఇదే దుస్థితి వచ్చింది. కరోనా కారణంగా మరణించిన అతనికి అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం ప్రభుత్వం తరుపున అధికారులే అంత్యక్రియలు నిర్వహించారు. 

పరగణాల జిల్లాలోని డమ్‌డమ్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. దీంతో అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. నాలుగు రోజుల తర్వాత పరిస్థితి విషమించి అతడు కన్నుమూశాడు. ఈ విషయాన్ని బంధువులకు తెలియజేయగా వారు ముందుకు రాలేదు. అతని కుటుంబ సభ్యులు కూడా కరోనా కారణంగా ఐసోలేషన్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసిన అతని భార్యా, కుమారుడు కన్నీరు పెట్టుకున్నారు. చేసేదేమి లేక అతని భార్య సంతకం తీసుకొని ప్రభుత్వ సిబ్బంది అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే స్థానికులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి  ప్రజలను చెదరగొట్టి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. మరోవైపు ఏఎంఆర్‌ఐ ఆసుపత్రి డాక్టర్లు, వైద్య సిబ్బందిని హోం క్వారంటైన్‌ కావాలని అధికారులు సూచించారు.