కరోనా టెన్షన్ తట్టుకోలేకనే భార్యను చంపేశా జడ్జి గారూ..  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా టెన్షన్ తట్టుకోలేకనే భార్యను చంపేశా జడ్జి గారూ.. 

October 16, 2020

LOCKDOWN Gun dealer incident wife with shotgun after becoming ‘psychotic’ with ‘stress of lockdown’

కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో ఎంతోమంది తమ కుటుంబాలతో ఎక్కువ సమయాన్ని గడిపామని చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోం చేసుకుంటూ భార్యాపిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపామని.. కుటుంబానికి ఎల్లవేళలా అందుబాటులో ఉన్నామని చెప్పినవారే ఎక్కువ. అయితే కొందరు మాత్రం ఈ లాక్‌డౌన్‌ను ఓ శిక్షలా అనుభవించారు. బయట తిరుగుళ్లకు మరిగినవారే అలా ఫీల్ అయిపోయారు. సినిమాలు, షికార్లు లేక కొందరు తమ స్వేఛ్చను కట్టేసినట్టు తెగ బాధపడిపోయారు. మరికొందరు చక్కని వ్యాయామాలు చేసుకుని, ఇతరాత్రా వ్యాపకాల్లో మునిగి లాక్‌డౌన్‌ను బాగా వినియోగించుకున్నారు. అయితే ఓ నీచుడు లాక్‌డౌన్ టెన్షన్ భరించలేక కట్టుకున్న భార్యనే తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి తానే భార్యను కాల్చి చంపానని చెప్పాడు. ఆ తర్వాత మాట మార్చి తన మీదకు ఏదో శక్తి ఆవహించడం వల్ల ఈ హత్య చేశానని.. ఓ అగంతకుడు వచ్చి తన భార్యను పొట్టన పెట్టుకున్నాడని చెప్పాడు. దీంతో పోలీసులు గందరగోళానికి గురై విచారణ చేపట్టి ఎట్టకేలకు అతడే తన భార్యను తుపాకీతో కాల్చి చంపాడని నిర్ధారించారు. 

ఇంగ్లండ్‌లోని ఇప్స్‌విచ్‌ నగరానికి సమీపంలోని బర్హామ్‌లో ఆ దారుణం చోటుచేసుకుంది.  షాట్‌ గన్‌‌ల వ్యాపారం చేసుకునే పీటర్‌ హాట్‌షోర్న్‌ జోన్స్‌ (51) గత మే నెలలో ఈ ఘోరానికి పాల్పడ్డారు. 17వ శతాబ్దానికి చెందిన తన ఫామ్‌ హౌజ్‌లో తన భార్య సిల్కీ జోన్స్‌ (41) ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. లాక్‌డౌన్ కారణంగా సిల్కీ జోన్స్‌కు కూడా వర్క్ ఫ్రమ్ హోం కల్పించారు. దీంతో ఆమె ఇంట్లో ఉండి ఆఫీస్ పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆరోజు పీటర్‌కు ఏమైందో తెలియదు భార్యను లైసెన్స్‌ కలిగిన 12 బోర్‌ షాట్‌ గన్‌తో రెండుసార్లు ఛాతిపై కాల్చి చంపేశాడు. అనంతరం పోలీసులకు ఫోన్ చేసి నేరాన్ని అంగీకరించాడు. విచారణలో మాట మార్చి చివరికి నేరాన్ని ఒప్పుకోక తప్పలేదు. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల మానసిక ఒత్తిడి పెరిగి ఏం చేస్తున్నానో తెలియని అయోమయ పరిస్థితుల్లో తన భార్యను చంపుకున్నానని నిందితుడు కోర్టు ముందు చెప్పాడు. తన మానసిక ఒత్తిడిని పరిగణలోకి తీసుకొని కఠిన శిక్ష విధించవద్దని మొర పెట్టుకోగా, ఇప్స్‌విచ్‌ క్రౌన్‌ కోర్టు కనికరించింది. కాగా, నిందితుడి మొరతో పాటు హత్యా సమయంలో నేరస్థుడి మానసిక స్థితి సరిగ్గా లేదంటూ కన్సల్టెంట్‌ సైక్రియాట్రిస్ట్‌ ఫ్రాంక్‌ ఫర్నాహామ్‌ ఇచ్చిన నివేదికను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఎన్నేళ్లు జైలు శిక్ష విధించాలనే అంశంపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 11 నుంచి ప్రారంభం అవుతుందని, కేసు విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు వైద్యుల సూచన మేరకు నిందితుడు క్రమం తప్పకుండా మానసిక వైద్యానికి మందులు వాడాలని స్పష్టంచేసింది.