లాక్‌డౌన్ పొడిగింపు.. రాష్ట్రాల డిమాండ్‌ను పరిశీలిస్తున్న కేంద్రం  - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్ పొడిగింపు.. రాష్ట్రాల డిమాండ్‌ను పరిశీలిస్తున్న కేంద్రం 

April 7, 2020

దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న కరోనా లాక్‌డౌన్‌ను ఈ నెల 14 తర్వాత కూడా కొనసాగించే సంకేతాలు కనిపిస్తాయి. మహమ్మారిని ఎదుర్కొనే వనరులు తమ వద్ద లేవని, ప్రజల ప్రాణాల కోసం లాక్ డౌన్‌ను కొనసాగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాల చేస్తున్న అభ్యర్థనలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. 

కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే లాక్‌డౌనే ఏకైక ఆయుధమని, దాన్ని మరికొంత కాలం కొనసాగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పడం తెలిసిందే. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాత్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు కూడా లాక్‌డౌన్ కొనసాగించాలని అంటున్నారు. లాక్‌డౌన్‌ను ఒక్కసారిగా కాకుండా దశల వారీగా ఎత్తేయాలని గెహ్లాత్ సూచిస్తున్నారు. వైరస్ ప్రభావం అత్యధికంగా ఉన్న మహారాష్ట్ర కూడా కొనసాగింపే మేలంటోంది.  కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని అస్సాం, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు చెబుతున్నాయి. అయితే కేసులు ప్రభావం పెద్దగా లేని, కేసులు అసలు లేని రాష్ట్రాలు మాత్రం లాక్ డౌన్‌ను దశలవారీగా తీసేయాలని కోరుతున్నాయి. దేశంలో కేసులు సంఖ్య ఇప్పట్లాగే గణనీయంగా పెరుగుతూ పోతే లాక్‌డౌన్ జూన్ రెండో వారం వరకు పొడిగించే అకాశం ఉంటుందని భావిస్తున్నారు. గత నెల 24 మోదీ 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించడం తెలిసిందే.