హైదరాబాద్‌ రోడ్లు జనమయం.. కనిపించని సరి-బేసి షాపులు - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌ రోడ్లు జనమయం.. కనిపించని సరి-బేసి షాపులు

May 20, 2020

mnbfg

హైదరాబాద్ రోడ్లు కళకళలాడుతున్నాయి. జనం మాస్కులు పెట్టుకుని రయ్యిన దూసుకెళ్తున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా అన్ని చోట్లా బ్యారికేడ్లు తొలగించారు. షాపులు తెరుచుకున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూళ్లు, మాల్స్, థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. ఒక్కసారిగా వాహనాలన్నీ బయటికి రావడంతో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రద్దీ కనిపిస్తోంది. సిగ్నళ్ల వద్ద పోలీసులు కరోనా హెచ్చరికలను జారీ చేస్తున్నారు. మాస్కు పెట్టుకోకపోతే జరిమానా పడుతుందని, కరోనా సోకుతుందని అంటున్నారు.  

షాపులు తెరిచినా ప్రభుత్వం చెప్పినట్లు సరిబేసి విధానం మాత్రం కనిపించడం లేదు. షాపులకు నంబర్లు వేయకపోయడంతో అందరూ తెరిచేశారు. చాలా చోట్ల భౌతిక దూరం పాటించడం లేదు. ఎంత త్వరగా తీసుకెళ్తే అంత మేలన్న జనం హడావుడి పడుతున్నారు. మద్యం షాపుల వద్ద రద్దీ కనిపించడం లేదు. సెలూన్లలో జనం పల్చగానే ఉన్నారు. సిటీ బస్సులు తప్ప అన్ని వాహనాలు తిరుగుతున్నాయి. ఆటో, ట్యాక్సీలు కూడా రోడ్డెక్కాయి. ఆటోలో డ్రైవర్ సహా ముగ్గురు, కార్లలో డ్రైవర్ సహా నలుగురు ప్రయాణించడానికి అనుమతి ఇచ్చారు. రెండు నెలల లాక్ డౌన్‌ను దాదాపు పూర్తిగా సడలించి కర్ఫ్యూను మాత్రం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.