ఎయిడ్స్‌కు మందు కనుక్కోవడంలో మరో ముందడుగు - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిడ్స్‌కు మందు కనుక్కోవడంలో మరో ముందడుగు

March 5, 2019

ప్రపంచంలో సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా కూడా ఇప్పటికీ ఎయిడ్స్‌లాంటి ప్రాణాంతక వ్యాధిని పూర్తిగా నివారించడానికి మందు కనిపెట్టలేక పోయాం. ఎయిడ్స్‌కు మందు కనిపెట్టడానికి పరిశోధనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ దిశగా ఇప్పుడు డాక్టర్లు మరో ముందడుగు వేశారు. లండన్‌లో హెచ్‌ఐవీ వైరస్ సోకిన ఓ వ్యక్తికి మూలకణ మార్పిడి (స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్) ద్వారా ఈ వైరస్ నుంచి ఉపశమనం కలిగినట్లు డాక్టర్లు తెలిపారు. అదే రోగికి క్యాన్సర్ చికిత్స కూడా అందిస్తున్నారు. ఇప్పుడు 18 నెలలుగా అతడు ఎలాంటి హెచ్‌ఐవీ డ్రగ్స్ తీసుకోవడం లేదని, ఆ వైరస్ నుంచి చాలా వరకు ఉపశమనం లభించిందని డాక్టర్లు చెప్పారు. అయితే హెచ్‌ఐవీ నుంచి అతడు పూర్తిగా బయటపడినట్లు కాదని తెలిపారు.

London HIV Patient World's Second To Be Cleared Of AIDS Virus: Doctors

పైగా హెచ్‌ఐవీ సోకి పూర్తి ఆరోగ్యంతో ఉన్న వ్యక్తుల్లో ఈ పద్ధతి పాటించడం కూడా ప్రమాదమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సదరు లండన్ పేషెంట్‌కు 2003లో హెచ్‌ఐవీ సోకింది. 2012లో క్యాన్సర్ బారిన పడ్డాడు. క్యాన్సర్ కోసం కీమోథెరపీ తీసుకున్నాడు. ఆ తర్వాత హెచ్‌ఐవీ వైరస్ నిరోధక శక్తి కలిగిన ఓ దాత నుంచి మూల కణాలను తీసుకుని ఆ పేషెంట్‌లోకి పంపించారు. దీంతో అతనికి క్యాన్సర్, హెచ్‌ఐవీల నుంచి ఒకేసారి ఉపశమనం లభించడం విశేషం. యూనివర్సిటీ కాలేజ్ లండన్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, కేమ్‌బ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల పరిశోధకులు ఈ కేసును అధ్యయనం చేశారు.