London's missing Rs. 6 crore car..live in pak..finally
mictv telugu

లండన్‌లో అదృశ్యమైన రూ.6 కోట్ల కారు..పాక్‌లో ప్రత్యక్షం..చివరికి

September 4, 2022

లండన్‌లో అదృశ్యమైన ఓ విలువైన కారు పాకిస్తాన్‌లో ప్రత్యక్షమవ్వటం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. లండన్‌ నుంచి పాకిస్థాన్‌ వరకు ఆ కారును ఎలా తీసుకొచ్చారు? అనే విషయంపై అనేక అనుమానాలు తలెత్తున్నాయి. అయితే, ఇంతకి ఆ కారు పేరు ఏంటి? దాని ధర ఎంత ఉంటుంది? ఎవరు దొంగిలించారు? అసలు కారణం ఏంటి? అనే తదితర విషయాలపై నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అదృశ్యమైన ఆ కారు పేరు బెంట్లీ, దాని ధర దాదాపు రెండు కోట్ల నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు ఉంటుందట.

వివరాల్లోకి వెళ్తే.. కొన్ని వారాల క్రితం బెంట్లీ కారు లండన్ నుంచి మాయమైంది. చివరకు అది పాకిస్థాన్‌కు అక్రమమార్గంలో చేరి, ఓ సంపన్నుడి చేతిలోకి వెళ్లిపోయింది. కారుని దొంగిలించడంలో ఉపయోగించిన తెలివిని..దాన్ని ట్రాక్ చేసే వ్యవస్థను గుర్తించడంలో మాత్రం దుండగులు విఫలమయ్యారు. బెంట్లీ కారులో ఉండే అత్యాధునిక ట్రాకింగ్ వ్యవస్థను ఆఫ్ చేయకపోవడంతో, లండన్‌లోని నేర విభాగం వాహనం ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించగలిగింది. కరాచీలోని ‘కలెక్టరేట్ ఆఫ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్‌కు సమాచారమిచ్చింది. దీంతో లండన్ నుంచి వచ్చిన వివరాలతో పాక్ అధికారులు కరాచీలో సంపన్నులు నివాసం ఉండే డీహెచ్ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు.

అనంతరం కారును గుర్తించిన అధికారులు.. ఓ ఐరోపా దేశానికి చెందిన దౌత్యాధికారి పత్రాలు ఉపయోగించుకొని, కారుని పాకిస్థాన్‌కు తరలించినట్లు విచారణలో తేలినట్లు వివరాలను వెల్లడించారు. కారుని అక్రమ మార్గంలో తరలించడం వల్ల దాదాపు 300 మిలియన్ల పాకిస్థాన్ రూపాయల పన్నును కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.