విమానంలో ఆమె ఒక్కరే..
విమాన ప్రయాణం నేటికీ చాలామందికి అందని ద్రాక్షపండే. అందులో ప్రయాణించే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తాం. మరి విమానంలో మనం ఒక్కరమే దర్జాగా ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? స్కాట్లాండ్ రచయిత్రి కరోన్ గ్రీవ్ కలిగిన అనుభవంలా ఉంటుంది.
189 మంది మంది పట్టే భారీ విమానంలో ఆమె ఒక్కరే ప్రయాణించారు. సిబ్బంది ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఆమె గత మూడు రోజుల క్రితం గ్లాస్గో నుంచి హెరాక్లీయాన్‌కు వెళ్లేందుకు జెట్ 2 ఎయిర్ లైన్స్ లో టికెట్ బుక్ చేసుకుంది. అయితే 189 మంది సీట్ల సామర్థ్యం ఉన్న ఆ విమానంలో కేవలం మూడంటే మూడే టికెట్లే బుక్ అయ్యాయి. కారణమేంటో తెలియదుగాని విమానం టేకాఫ్ తీసుకునే సమయానికి విమానంలో కరోన్ గ్రీవ్ మాత్రమే ఉంది. మిగతా ఇద్దరూ రాలేదు. దీంతో ఆమెతోనే విమానం బయల్దేరింది. ఆహారం, కాఫీ అందించే సిబ్బందికి ఇక పనేమీ లేకపోకపోవడంతో ఆమెను వీఐపీలా చూసుకున్నారు. వారంతా తనను చాలా జాగ్రత్తగా చూసుకున్నారని కరోన్ చెప్పింది. అన్ సీజన్ కావడంతో టికెట్ల బుకింగ్ తక్కువగా ఉందని సదరు విమానయాన సంస్థ చెప్పింది.