ట్రంప్ తక్కువోడు కాదు.. భారత్‌లో కట్టిన పన్నే ఎక్కువ  - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్ తక్కువోడు కాదు.. భారత్‌లో కట్టిన పన్నే ఎక్కువ 

September 28, 2020

LONG-CONCEALED RECORDS SHOW TRUMP’S CHRONIC LOSSES AND YEARS OF TAX AVOIDANCE

ఆదాయం పన్ను కట్టాల్సిందేనని సాధారణ పౌరులకు చెప్పే పెద్దలే పన్ను కట్టకపోతే? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను తక్కువేం కాదు అన్నట్టు.. గత పదేళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే ఆదాయపు పన్ను చెల్లించారు. న్యూయార్క్‌ టైమ్స్‌ ఆదివారం నాటి సంచికలో ఈ విషయాలను వెల్లడించింది. ట్రంప్‌ గత 15 ఏళ్ల కాలంలో పదేళ్లపాటు ఆదాయం పన్ను చెల్లించకుండా తప్పించుకున్నారు. 2016లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఎన్నికయ్యాక ఆ సంవత్సరంలో కేవలం 750 డాలర్లు,  2017లో మరో 750 డాలర్లు ఆదాయం పన్ను చెల్లించారు. 2017లో యూఎస్‌కు కట్టిన పన్ను కంటే, భారత్‌కు ట్రంప్ చెల్లించిన పన్నులు ఎక్కువగా ఉన్నాయని ఆ కథనం పేర్కొంది.  2017లో ట్రంప్ భారత్‌కు 1,45,400 డాలర్లు పన్ను రూపంలో చెల్లించినట్టు వివరించింది.  ఆదాయానికి మించిన నష్టాలు రావడంతో తాను ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదంటూ అమెరికా ప్రభుత్వ రెవెన్యూ శాఖకు ట్రంప్‌ వివరణ ఇచ్చారు. 

తాను కిమిషనర్‌ ఆధ్వర్యంలో ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీస్‌ ఆడిట్‌ పరిధిలో ఉన్నందున తాను ఆదాయం పన్ను రిటర్న్స్‌ను ప్రజలకు వెల్లడించలేనని కూడా ట్రంప్‌ చెప్పుకున్నారు. అయితే ఆయన తన ఆస్తుల వివరాలనుగానీ, నష్టాల వివరాలనుగానీ వెల్లడించలేదు. ఆయన ఆస్తులపై అమెరికా రెవెన్యూ శాఖ ఎలాంటి దర్యాప్తునకు ఆదేశించలేదు. అమెరికా చట్టాల ప్రకారం అమెరికా అధ్యక్షులు తమ వ్యక్తిగత ఆదాయం వివరాలను ప్రజాముఖంగా వెల్లడించాల్సిన అవసరం లేదు. 1970లో అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్‌ నిక్సన్, ఇప్పుడు ట్రంప్‌ మాత్రమే ఆస్తుల వివరాలను వెల్లడించలేదు. మిగతా అధ్యక్షులు అందరూ వెల్లడించారు. కోట్ల డాలర్ల ఆస్తి కలిగిన ట్రంప్‌ నష్టాల పేరిట ఆదాయ పన్నును తప్పించుకోవడమే కాకుండా.. గతంలో కట్టిన పన్ను నుంచి కొంత మొత్తాలను వెనక్కి తీసుకుంటున్నారంటూ న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన వార్తను ట్రంప్‌ తప్పుబట్టారు. తాను కేంద్ర ప్రభుత్వానికే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పన్నులు చెల్లిస్తున్నానని, పన్ను భారం తగ్గించుకునేందుకు సిబ్బందిని ఎక్కువగా నియమించుకుంటున్నానని ఆయన తెలిపారు. కాగా, నవంబర్ 3న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.  ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పన్ను చెల్లించలేదని ఆరోపణలతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.