ఫిఫా వరల్డ్ కప్‌లో అర్జెంటీనా జట్టు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ట్రోఫీ నెగ్గింది. ఫుట్‌బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఎట్టకేలకు ట్రోఫీ ముద్దాడాడు. దీంతో కేవలం అర్జెంటీనాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు సంబరాలు చేసుకొంటున్నారు. ఈ క్రమంలో అర్జెంటీనా విజయం సాధిస్తే 1000 ప్లేట్ల చికెన్ బిర్యానీలను ఉచితంగా పంపిణీ చేస్తానని కేరళకు చెందిన ఓ హోటల్ యజమాని ప్రకటించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ను ఓడిస్తూ అర్జెంటీనా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. దీంతో ఇచ్చిన మాట ప్రకారం.. ఆ హోటల్ యజమాని బిర్యానీలను ఉచితంగా పంపిణీ చేశాడు.
కేరళలోని త్రిస్సూర్‌లో ఉన్న ఆ హోటల్ యజమాని శిబు పి ఉచితంగా 1000 ప్లేట్ల చికెన్ బిర్యానీ పంపిణీ చేసి మాట నిలబెట్టుకున్నాడు. ఈ బిర్యానీ పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే షఫీ పరంబిల్ ప్రారంభించారు. ఇక ఆ హోటల్‌కు ప్రజలు క్యూ కట్టారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో అదనంగా మరో 500 మందికి అందించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ముప్పై ఆరేళ్ల తర్వాత అర్జెంటీనా గెలిచిన నేపథ్యంలో బిర్యానీలను ఉచితంగా పంపిణీ చేయడం సంతోషంగా ఉందని శిబు పేర్కొన్నాడు. మెస్సీ ట్రోఫికి అర్హుడని, తాను 1500 మందికి ఉచితంగా చికెన్ బిర్యానీ అందించామని మెస్సీ అభిమాని అయిన శిబు చెప్పారు. ఫిఫా ప్రపంచ కప్ ట్రోఫీని అర్జెంటీనా జట్టు గెలిచిన తర్వాత కేరళలో మెస్సీ అభిమానులు వేడుకలు జరుపుకున్నారు.