Long time 1855 train launch..this is the video
mictv telugu

మళ్లీ పట్టాలెక్కిన 1855 నాటి పురాతన రైలు..వీడియో ఇదిగో

August 11, 2022

Long time 1855 train launch..this is the video

భారత రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న మరోసారి పట్టాలపై నడిపించడానికి సిద్దమైంది. ఆగస్ట్ 15 తేదీన తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-కోడంబాక్కం మధ్య ఈ రైలును నడిపించాలని అధికారులు నిర్ణయించారు. అయితే, రైలును ఇన్ని సంవత్సరాల తర్వాత పట్టాలను ఎక్కించబోతున్న తరుణంలో ముందుగా ట్రైన్ ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియలో అధికారులు పోస్ట్ చేశారు.

ఈ EIR-21 రైలుకు సంబంధించిన కొన్ని వివరాలను అధికారులు వెల్లడించారు.”ఈ రైలు అతి పురాతనమైనది. 1855లో దీనిని ఇంగ్లండ్‌లో తయారుచేశారు. ఈ రైలు ఆవిరితో నడుస్తుంది. బ్రిటీష్ పాలనలో 1909 వరకు ఈ రైలును అధికారులు నడిపించారు. స్వాతంత్ర్యం వచ్చాక ఈ రైలును హౌరాలోని జమాల్‌పూర్‌లో ప్రజల సందర్శనార్థం కోసం ఉంచారు. ప్రపంచంలోని ఇది అతి పురాతన రైలు అని చెప్పడానికి దీనిని ప్రదర్శన కోసం హౌరాకు ఈ రైలును తరలించారు. ప్రస్తుతం చెన్నై మెట్రో సిటీ పెరంబూర్ లోకోమోటివ్ వర్క్స్‌లో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ రైలును గణతంత్ర దినోత్సవం లేదా స్వాతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాలలో బయటకు తీసుకువచ్చి చరిత్రను ప్రజలకు చాటి చెప్పేందుకు నడిపిస్తుంటాం” అని అధికారులు పేర్కొన్నారు.

మరోపక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్నీ రాష్ట్రాలకు జాతీయ జెండాలను పంపిణీ చేసింది. ప్రతి భారతీయుడు తమ ఇంటిపై ఆగస్ట్ 15న జాతీయ జెండాను రెపరెపలాడించాలని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మరోసారి 1855లో తయారు చేయబడిన EIR-21 రైలును ఆగస్టు 15న నడిపించాలని రైల్యేశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.