భారత్ ఓ మురికి దేశం.. ట్రంప్ నోటి దూల - MicTv.in - Telugu News
mictv telugu

భారత్ ఓ మురికి దేశం.. ట్రంప్ నోటి దూల

October 23, 2020

Look at India, the air is filthy, says US President Donald Trump at final debate.jp

ఈ ఏడాది మొదట్లో భారత్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద, ప్రధాని మోదీ మీద ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ట్రంప్ అదంతా తూచ్ అన్నట్టు భారత్ మీద నోటి దూల ప్రదర్శించారు. అప్పుడ‌ప్పుడు భార‌త్‌పై నోరుపారేసుకునే ట్రంప్ ఈసారి కాస్త శృతిమించారు. భారత్‌ను మురికి దేశంగా అభివర్ణించిన ఆయన.. ఇండియాలో స్వచ్ఛమైన గాలి లేదని అన్నారు. అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన ఇద్ద‌రు అభ్య‌ర్ధులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య మూడో డిబేట్‌లో మాట్లాడారు. ఇందులో ఇద్దరు అభ్యర్థులు పర్యావరణ మార్పులపై చర్చించారు. ఈ సందర్భంగా ట్రంప్.. భారత్‌పై అక్కసును వెళ్లగక్కారు. పర్యావరణాన్ని భారత్ కలుషితం చేస్తోందని ఆరోపించారు. భారత్, చైనా, రష్యా దేశాలు కాలుష్య కారకాలను విపరీతంగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని.. దీంతో పర్యావరణం కలుషితం అవుతోందని ట్రంప్ విమ‌ర్శించారు. 

చైనా, రష్యా, భారత్‌లను చూస్తే ఎంత మురికిగా ఉంటాయో అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. ఆ మూడు దేశాల్లో గాలి కూడా మురికిగా ఉంటుందని ఆరోపించారు. మరోపక్క ప్యారిస్ ఒప్పందం నుంచి బయటికి రావడాన్ని ట్రంప్ సమర్ధించుకున్నారు. ఆ ఒప్పందంతో అమెరికాకు ఎటువంటి ప్రయోజనం లేకపోగా.. కోట్లాది రూపాయలను నష్టపోతుందని పేర్కొన్నారు. మిలియన్ల కొద్ది ఉద్యోగాలను, వేలాది కంపెనీలను నష్టపోవడం ఇష్టం లేకే.. ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంచేశారు. కాగా.. భారత్‌పై ట్రంప్ చేసిన విమర్శలపై భారతీయులు భగ్గుమంటున్నారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.