అయోధ్య వివాదం కాస్తా…‘ శ్రీరాముడి వారసులెవరు? అయోధ్యలో రఘువంశ వారసులు ఇంకా ఉన్నారా?’ అన్న ప్రశ్నకు దారితీసింది. వివాదాస్పద భూమి కేసులో సుప్రీం కోర్టు వేసిన ఈ ప్రశ్నకు లాయర్లు సమాధానాలు వెతుకుతున్నారు. పురాణాలు తిరగేస్తున్నారు. చరిత్రను చెరుగుతున్నారు. శ్రీరాముడి వంశవృక్షాన్ని పరిశీలిస్తూ చారిత్రక ఆధారాలను అన్వేషిస్తున్నారు.
భారతీయ ఇతిహాసాల్లో కొన్ని పాత్రలు ఒక దాంట్లోంచి మరోదాంట్లోకి ప్రవేశిస్తుంటాయి. జనం చెప్పుకునే కథలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. హనుమంతుడి పాత్ర రామాయణంలోనే కాకుండా మహాభారతంలోనూ కనిపిస్తుంది. కృతయుగం నాటి రామాయణంలోని రాముడి వారసులు ద్వాపర యుగం నాటి మహాభారతంలోకీ, తర్వాత కలియుగంలోకి.. తాజాగా సుప్రీం కోర్టు ప్రశ్నతో క్రీస్తుశకం 2019 ఆగస్టు నెలలోకీ వచ్చేశారు. తాము రాముడి కొడుకైన కుశుడి వంశానికి చెందిన వాళ్లమని, అందుకు సాక్ష్యాలు ఉన్నాయని జైపుర్ రాచకుంటుంబ ‘రాణి’ దియాకుమారి మొన్న చెప్పారు. తర్వాత తామూ సీతాపతి వంశస్థులమేనని మేవాడ్-ఉదయ్‌పూర్ రాజకుటుంబానికి చెందిన మహేంద్రసింగ్ ప్రకటించారు. తమ పూర్వీకులు రాముడి పుత్రుడైన లవుడి వారసులని వివరించారు. ‘వారు అప్పట్లో గుజరాత్లో ఉండేవారు. తర్వాత మేవాడ్‌కు వచ్చారు… దీనికి అవసరమైన సాక్ష్యాలను, దస్త్రాలను కోర్టుకు ఇస్తాం..’ అని అన్నారు.
దీంతో కేసు కొత్త మలుపు తిరగడమే కాకుండా, ఈ రాజవంశస్థులు చెబుతున్నదానికి ఆధారాలేంటన్న ఆసక్తి కూడా కలుగుతోంది. రామాయణం, భారతం, ఇతర పురాణాలు, కథలు, కావ్యాల ప్రకారం రాముడి వారసులను గుర్తించడం అంత తేలికైన విషయం కాదని కొందరు, ఉన్న సమాచారం నుంచే ఒక అంచనాకు రావచ్చని కొందరు అంటున్నారు. మరి రాముడి వంశవృక్షం కథాకమామిషు ఏంటో చూద్దామా! ఇనకులం సూర్యుడి నుంచి దశరథుడి మీదుగా రాముడి వరకు, అతని తనయులైన లవకుశుల నుంచి.. వారి వారసులమని చెప్పుకుంటున్న వారి దాకా ఏం జరిగిందంటే..
ఇదీ వంశవృక్షం
శ్రీరాముడు → కుశుడు → అతిథి → నిషాదుడు → నలుడు → నభాసుడు → పుండరీకుడు → క్షేమధన్వుడు → దేవనీకుడు → అహినాగుడు → పరిపత్రుడు → దలుడు → ఉక్తుడు → వజ్రనాభుడు → శంఖనుడు → వ్యుషితాశ్వుడు → విశ్వసాహుడు → హిరణ్యనాభుడు → పుష్యుడు → ధ్రువసంధుడు → అగ్నివర్ణుడు → శృంగుడు → మారుడు → ప్రసుస్రుష్టుడు → సుసంధుడు → అమర్షుడు → విశ్రుతవంతుడు → బృహద్బలుడు → బృహత్కక్షయుడు → ఉరుక్షయుడు → వాత్సవ్యూహుడు → ప్రతివ్యోముడు → దివాకరుడు సహదేవుడు → బృహదశ్వుడు → భానురథుడు → ప్రతితశ్వుడు → సుప్రతీకుడు → మరుదేవుడు → సునక్షత్రుడు → కిన్నెరుడు → అంతరిక్షుడు →సువర్ణుడు → సుమిత్రా అమిత్రజితుడు → ధర్మిణుడు → కృతంజయుడు → సంజయుడు → మహాకోసలుడు → ప్రసేనజిత్తు → క్షుద్రకుడు → కులాకుడు → సురథుడు → సుమిత్రుడు..
అభిమన్యుడి చేతిలో
86వ తరానికి చెందిన బృహద్బలుడు మహాభారత యుద్ధంలో కౌరవుల వైపు నిలిచి పద్మవ్యూహంలో అభిమన్యుడిని చుట్టముడతాడు. అభిమన్యుడు అతణ్ని తలనరికి చంపేస్తాడు. ఈ బృహద్బలుడి తర్వాత.. 117వ తరానికి చెందిన సుమిత్రుణ్ని మగధ సామ్రాజ్య నిర్మాత అయిన మహాపద్మనందుడు ఓడిస్తాడు. నందుడి వారసులను చంద్రగుప్త మౌర్యుడు తుదముట్టిస్తాడు. సుమిత్రుడిలో ఇక్ష్వాకు వంశం ముగిసిందని మత్య్స, వాయు, బ్రహ్మాండ పురాణాలు చెబుతున్నాయి.
సూర్య వంశాలు, చంద్రవంశాలు..
భారత దేశంలో గణరాజ్యాల కాలం నుంచి సూర్యవంశ, చంద్రవంశాలనేకం కనిపిస్తాయి. చరిత్రకు, చారిత్రక ఆధారాలకు అందుతున్న దాదాపు అన్ని ప్రసిద్ధ భారత రాజకుటుంబాలూ తాము వీటికి చెందిన వారమని చెప్పుకుంటున్నాయి. ఇండోనేసియా, కంబోడియా, శ్రీలంక వంటి దేశాల రాచకుటుంబాలదీ ఇదే వాదన. జైపూర్ అయినా, మేవాడ్ అయినా, మరేదైనా సరే ప్రతి రాజకుటుంబమూ ఈ వాదన చేస్తుంటుంది. రాముడు సూర్యవంశ సంజాతుడు కనుక తామూ ఆ వంశానికి చెందిన వారమని రాజపుత్ర వంశాలు కొన్ని చెబుతుంటాయి. సిద్ధార్థ గౌతముడు కూడా రామయ్య జన్మించిన ఇనకులంలోనే జన్మించాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. భారతదేశ చరిత్రలో కల్పనలు, వాస్తవాలు కలగలసి ఉంటాయి. దేనిపైనా కచ్చితమైన అంచనాకు రాలేని పరిస్థితి. జైపూర్, మేవాడ్ రాజవంశీకులైనా, మైసూర్, విజయనగర వంశాల వారసులైనా తాము రాముడి వారసులమని రుజువు చేసుకోవడం అంత సులభం కాదు. వారు చూపే సాక్ష్యాలు కోర్టులో నిలబడతాయా అన్నది మరో ప్రశ్న. గతించిన చరిత్రలో ఎవరు ఎవరికి వారసులో తేల్చే పనిని సుప్రీం కోర్టు నిజంగానే సీరియస్‌గా తీసుకుంటే ఆసేతుహిమాచలం నుంచి కొంగొత్త ‘వారసత్వ’ కేసులు వెల్లువెత్తడం ఖాయం!