సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీ కొట్టిన సంఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. చిన్నకోడూరు మండలం మల్లారం స్టేజీ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. రాంగ్ రూట్లో వచ్చిన లారీ కారును ఢీకొట్టినట్లుగా తెలుస్తున్నది. మల్లారం స్టేజి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ డివైడర్ దాటి వచ్చి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కారులో ఉన్న భార్యాభర్తలతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.