Lost father to politics of hate, will not lose country to it: Rahul Gandhi
mictv telugu

తండ్రిని కోల్పోయాను.. దేశాన్ని వదులుకోవ‌డానికి సిద్దంగా లేను.. రాహుల్ గాంధీ

September 7, 2022

తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఉన్న తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ స్మారకాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సందర్శించారు. బుధవారం ఉదయం ప్రత్యేక నివాళులు అర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించదలచిన ‘భారత్‌ జోడో యాత్ర’ బుధవారం లాంఛనంగా ప్రారంభం కానుంది.

భారత్ జోడో యాత్ర ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ శ్రీపెరంబ‌దూర్‌లోని త‌న తండ్రి, మాజీ ప్ర‌ధాని రాజీవ్‌గాంధీ స్మార‌కం వ‌ద్ద నివాళి అర్పించారు. అనంత‌రం ఓ భావోద్వేగ పూరిత‌మైన సందేశాన్ని ట్విట్ట‌ర్ వేదికగా పంచుకున్నారు. ఆనాడు ద్వేషపూరిత రాజకీయాల వల్ల తన తండ్రిని కోల్పోయానని, అలాంటి ప‌రిస్థితుల్లో నేడు ప్రియమైన దేశాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేనని అన్నారు. విద్వేషం, విభజన రాజకీయాల వ‌ల్లే త‌న తండ్రి ప్రాణాలు కోల్పోయాడ‌నీ, కానీ.. అటువంటి విద్వేష రాజ‌కీయాల‌కు ప్రియమైన దేశాన్ని వ‌దులుకోలేన‌నీ అన్నారు. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుందనీ, ఆశ భయాన్ని ఓడిస్తుందనీ, మ‌నంద‌రం కలిసి ఆవ‌రోధాల‌ను అధిగమిస్తామని ట్వీట్ చేశారు. 1991, మే 21న శ్రీపెరంబుదూర్ లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.