78 ఏళ్ల బామ్మకు 22 ఏళ్ల జైలు.. కొంప ముంచిన కోపం.. - MicTv.in - Telugu News
mictv telugu

78 ఏళ్ల బామ్మకు 22 ఏళ్ల జైలు.. కొంప ముంచిన కోపం..

October 29, 2019

78-year-old woman sentenced to 22 years in jail .

78 ఏళ్ల వయసున్న బామ్మకు 22 ఏళ్ల జైలుశిక్ష పడింది. కృష్ణారామా అనుకునే వయసులో ఆమె చేసిన నేరం ఏంటని ఆలోచిస్తున్నారు కదూ. ఆమె ఓ లాయర్‌ను గన్నుతో కాల్చి పారేద్దామనుకుంది. కానీ, అడ్డంగా బుక్ అయింది. ఆమె ఎందుకు ఆ లాయర్‌ను చంపాలనుకుందంటే.. ఆమె కేసును అతను సరిగ్గా వాదించలేడు అనుకుంది. అంతే తాను కోర్టులో ఓడిపోవడానికి కారణం సదరు లాయరే అనుకుని కక్ష గట్టింది. మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించి విచారణ జరిపిన అమెరికాలోని లూసియానా కోర్టు.. ఆమెకు 22 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఓ బ్యాంకులో సదరు బామ్మ లోన్ తీసుకుంది. అయితే లోను  చెల్లింపు విషయంలో ఆమె ప్లేటు ఫిరాయించదని ఆరోపిస్తూ బ్యాంకు అధికారులు ఆమెపై కోర్టులో కేసు వేశారు. 

అప్పుడు ఆమె తన తరఫున వాదించాడానికి ఓ న్యాయవాదిని నియమించుకుంది. అతను కేసు వాదిస్తున్నాడు కానీ, బామ్మ కేసు ఓడిపోయింది. దీంతో సదరు లాయర్ చేతకానితనం వల్లే తాను ఈ కేసు ఓడిపోయానని భావించింది. అతన్ని చంపాలని పథకం వేసుకుంది. 2016లో ఓరోజు రాత్రిపూట మిషన్ గన్ తీసుకుని నేరుగా అతని ఇంటికి వెళ్లింది. డోర్ తీసిన న్యాయవాది ఎదుట.. గన్ను చేతిలో పట్టుకుని ఆమె నిప్పులు చెరుగుతున్న ముఖంతో కనిపించింది. అంతే అతనికి విషయం అర్థం అయిపోయి, వెంటనే ఆమెను నిలువరించే ప్రయత్నం చేశాడు. ఆమె మీద పడి గన్ను లాక్కున్నాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి చూసేసరికి ఆమె నేల మీద పడి ఉంది. న్యాయవాది కూడా ఆ గదిలోనే ఉన్నాడు. మెషిన్ గన్ కూడా కనిపించింది. న్యాయవాది ఫిర్యాదుతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అప్పుడామె వయసు 75 ఏళ్లు ఉంటుంది. మూడేళ్లుగా ఈ కేసు విచారించిన కోర్టు.. బామ్మకు 22 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.