తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో పరువుహత్యలు కలకలం రేపుతున్నాయి. ఒకదాన్ని మర్చిపోయేలోపే ఇంకోటి జరుగుతూ.. భయాందోళనలకు గురిచేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే ఇటీవల ఒకదాని వెనక ఇంకోటి రెండు పరువు హత్యలు సంచలనం సృష్టించాయి. అవి మరవకముందే.. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్కొండలో మరో ఘాతుకం వెలుగుచూసింది.
తమ కూతురు వేరే మతానికి చెందిన వ్యక్తిని ప్రేమిస్తుందని తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను మందలించారు. అయినప్పటికీ ఆ యువతి తన ప్రేమను కొనసాగించింది. దీంతో ఆమెను తల్లిదండ్రులే హత్య చేశారు. కుమార్తె గొంతును కత్తితో కోసేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని రాజేశ్వరి(20)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.