ప్రేమించుకోండి.. కానీ అలాంటి చోట్లకు వెళ్లకండి..! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమించుకోండి.. కానీ అలాంటి చోట్లకు వెళ్లకండి..!

February 3, 2018

ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు.. ప్రియుడితో కలిసి షికారుకు వెళ్లిన యువతిపై గ్యాంగ్ రేప్..

తెలంగాణలోని జగిత్యాల జిల్లా హుస్నాబాద్.. బైక్‌పై ప్రియుడితో వెళ్తున్న యువతిపై దాడి, గ్యాంగ్‌రేప్

గుజరాత్‌లోని మెహ్ సనా జిల్లా.. ప్రియుడితో కలసి వెళ్తున్న అమ్మాయిపై అత్యాచారం, దోపిడీ, హత్య..  

ఇటీవల కొంతకాలంగా వస్తున్న వార్తలివి. మనసులు కలసి, ఒకరినొకరు ఇష్టపడి భవిష్యత్తుపై బంగారు కలలతో ప్రేమ పావురాళ్లా తిరుగుతున్న జంటలను కబళిస్తున్న కామాంధులు, నికృష్టులు బోర విచురుకుని తిరుగుతున్న అమానుష వర్తమానం ఇది. దేశంలో అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్లని గాంధీ అన్నాడు. అయితే పట్టపగలే తెలిసిన మగవాడితో కలిసివెళ్తున్న ఆడవాళ్లకే రక్షణ లేని అభద్రత ఘన భారతదేశంలో జరుగుతున్న ఈ ఘాతుకాలకు అడ్డుకట్ట పడేదెలా?ప్రేమించడం తప్పుకాదు..

యుక్తవయసుకు వచ్చిన స్త్రీపురుషుల మధ్య ప్రేమ సహజం. అందులో తప్పేమీ లేదు. అయితే ప్రేమ కంటే కెరీర్ ముఖ్యం. కాలేజీ విద్యార్థులు దీనిపై దృష్టి సారించాలి. జీవితంలో తనకాళ్లపై తాను నిలబడేందుకు యత్నించాలి. అంతవరకు ప్రేమను వాయిదా వేసుకుంటే మేలు. ప్రేమ.. కులమతాలను, ఆస్తిఅంతస్తులను చూడదని అంటారు. అది నిజమే కావచ్చు కాని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనసును చంపుకోకుండా.. జాగ్రత్తగా అడుగులు వేయాలి. ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులను ఒప్పించేందుకు యత్నించాలి. వారు ఒప్పుకోకపోతే వాయిదా వేసుకోవాలి. ఆత్మహత్యల జోలికి పోకుండా, వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా పోరాడాలి. కులమతాలు కరిగిపోతున్న కాలం ఇది. మార్పు వస్తుంది. మీ ప్రేమకు ఢోకా ఉండదు..పెద్దల తీరు మారాలి..

పెద్దలు కూడా పిల్లల నిర్ణయాలను గౌరవించాలి. ఆచితూచి స్పందించాలి. తప్పు చేస్తున్నట్లు తెలిస్తే సున్నితంగా మందలించాలి. చచ్చిపోతామనో, లేకపోతే చంపుతామనో బెదిరించకూడదు.. పిల్లల నిర్ణయాల్లో తప్పులుంటే ఓపిగ్గా వారికి నచ్చజెప్పాలి. భవిష్యత్తు గురించి వివరించాలి.  కుటుంబం, పరువు, మర్యాద అంటూ భయపెట్టకూడదు. వీలైతే అవతలి కుటుంబంతోనూ సంప్రదింపులు జరిపి సమస్య సానుకూలంగా పరిష్కారమయ్యేలా చూడాలి..

ప్రేమ ప్రయాణాల్లో జాగ్రత్తలు..

ప్రేమజంటలు ఏకాంతం కోరుకోవడం సహజం. ఏకాంతం కేవలం శృంగారం కోసమే కాదు. మనసు విప్పి మాట్లాడుకోవడానికి, దగ్గరితనానికి కూడా అవసరం. అయితే పరిసరాలను దృష్టిలో ఉంచుకోవడం తప్పనిసరి. నగరాల్లో అయితే కాస్త జన సంచారం ఉండే ప్రాంతాలను ఎంచుకోవాలి.  జనం మీ దగ్గరికొచ్చిమరీ మీరేం మాట్లాడుకుంటున్నారో చెవులు పెట్టి వినరు. కనుక అపరిమితమైన ఏకాంతం కాకపోయినా పరిమితమైన ఏకాంతం కచ్చితంగా ఉంటుంది. సినిమా హాళ్లు, కాఫీ హోటళ్లు, షాపింగ్ మాల్స్.. ఇలాంటి  వాటిని ఎంచుకుంటే మంచిది. కానీ మనది మానవ సమాజం. ఎక్కడైనా కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ సంగతి మరవ కూడదు. ఒకవేళ మీరు ప్రేమిస్తున్న వ్యక్తి(ఎక్కువ సందర్భాల్లో అబ్బాయే)  ఎవరూ లేని చోటుకు పోదామని కోరితే.. ఆ ప్రాంతం ఎక్కడ, అక్కడి పరిస్థితుల గురించి ఆరా తీయాలి. భద్రత లేని ప్రాంతాలకు నో చెప్పేయాలి. అతని ప్రవర్తనపై గాని, అతని స్నేహితులపైగాని ఏమాత్రం చిన్నపాటి అనుమానం వచ్చినా స్పష్టంగా రానని చెప్పేయాలి. అనుమానాలు నిజమైతే ఆ ప్రేమను, స్నేహాలను తుంచేస్తే బెటర్.  గ్రామీణ ప్రాంతాల్లో..

ప్రేమజంటలపై  జరుగుతున్న నేరాల్లో ఎక్కవశాతం చిన్నపట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. యువతీ యువకులు పల్లెపట్టును ఎంచుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. దుండగులు దీన్ని అదునుగా తీసుకుంటున్నారు. కనుక ప్రేమజంటలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరూ ఎప్పుడూ నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లకూడదు. దగ్గరిలో జనం తిరగే ప్రాంతాలనే షికారుకు ఎంచుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నది స్నేహితులకో, కుటుంబ సభ్యులకో ముందే చెబితే మంచిది. ఇప్పటిలోగా వచ్చేదీ చెప్పి ఉంచాలి.. ముఖ్యంగా యువతులు ఎవరికీ చెప్పకుండా ఇలాంటి ప్రాంతాలకు అసలు వెళ్లకూడదు. ప్రియుడి మంచివాడే కావొచ్చు. కానీ నేరాలు చేయడానికి కాసుక్కూర్చునే వాళ్లు మంచివాళ్లు కారు కదా. పోలీసుల ఫోన్ నంబర్లు, అంబులెన్స్ నంబర్లు వంటి అత్యవసర ఫోన్ నంబర్లను ఫోన్లలో సేవ్ చేసుకోవాలి. ఫోన్లలో తగినంత చార్జింగ్ ఉండేలా చూసుకోవాలి…ఆత్మరక్షణ సాధనాలు..

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు ముష్కరులు తారస పడుతూనే ఉంటారు. వారిని ఎదుర్కొనే ఆత్మరక్షణ పద్ధతుల గురించి కూడా ప్రేమజంటలు తెలుసుకోవాలి. మార్షల్ ఆర్ట్స్ వరకు పోనక్కర్లేదుగాని, పెప్పర్ స్ప్రే వంటి, సేఫ్టీ రాడ్స్ వంటి చిన్నపాటి ఆత్మరక్షణ పరికరాలను తీసుకెళ్లడం తప్పేమీ కాదు.

ప్రేమకు నమ్మకం పునాది. ఆ నమ్మకాన్ని వమ్ముచేసుకునే పరిస్థితులు రాకుండా వ్యవహరించాలి. అప్పుడే ప్రేమ యాత్రలు బృందావన యాత్రలు అవుతాయి.. లేకపోతే విషాద యాత్రలే.. కనుక లవ్ బర్డ్స్.. టేక్ కేర్..!