ఇద్దరు యువతీయువకులు ప్రేమించుకున్నారు. అయితే కులాలు వేరు కావడం వల్ల పెద్దలు పెళ్లికి నిరాకరించారు. గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టినా కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. దీంతో ఎమ్మెల్యేకు విషయం చేరవేయగా, ఆయన ప్రేమికులిద్దరినీ పిలిచి పార్టీ ఆఫీసులోనే ఘనంగా పెళ్ళి జరిపించి రాష్ట్రంలో కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అనపర్తి మండలం లక్ష్మీ నరసాపురానికి చెందిన లంకలపూడి దుర్గా మల్లేష్, విజయల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరి ప్రేమ విషయం తెలిసిన పెద్దలు కులాలు వేరు కావడంతో జంటను హెచ్చరించారు. అయినా ప్రేమికులిద్దరూ తరచూ కలుస్తుండడంతో వ్యవహారం గ్రామ పంచాయితీ వరకు వెళ్లింది. అక్కడ పంచాయితీ పెద్దలు నచ్చజెప్పినా ఇరు పక్షాల కుటుంబీకులు పెళ్లికి అంగీకరించకపోవడంతో పంచాయితీ పెద్దలు ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ప్రేమికులను ఒక్కటి చేశారు. అంతేకాక, అనపర్తి వైసీపీ పార్టీ ఆఫీసులోనే ఆ జంటకు పెళ్లి జరిపించి దండలు మార్పించారు. అనంతరం నూతన వధూవరులు ఎమ్మెల్యేకి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి
అదృష్టం కలిసొచ్చి రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు.. రఘునందన్ రావు
బీఆర్ఎస్లో ముసలం.. మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల గుస్సా