అల్లరోడికి ఘోర పరాభవం - MicTv.in - Telugu News
mictv telugu

అల్లరోడికి ఘోర పరాభవం

November 26, 2022

మళ్ళీ తెలుగు చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ చిత్రాల హవా కనపడుతోంది. ఒక 10 సంవత్సరాల క్రితం విక్రమ్, ధనుష్, సూర్య, కార్తీల చిత్రాలు తెలుగు సినిమాలకు దీటుగా ఆడేవి. మన రోడ్డ కోట్టుడు కామెడీ చిత్రాలు భరించలేక తెలుగోళ్లు సైతం డబ్బింగ్ చిత్రాల మోజులో పడిపోయిన రోజులవి. అయితే రాజమౌళి బాహుబలి చిత్రం తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. బాహుబలి స్పూర్తితో తెలుగులో కమర్షియల్ ఫార్ములాని పక్కన పెట్టేసి కంటెంట్‌కి ప్రాధాన్యం ఇవ్వటం మొదలుపెట్టారు. ఇక కరోనా తరువాత అయితే టాలీవుడ్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. వరుస పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచం దృష్టిని ఆకర్శిస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. తెలుగులో డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు వస్తుండటంతో డబ్బింగ్ చిత్రాలపై మోజు అమాంతం తగ్గింది. అయితే కొద్దినెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్‌పై వరుసగా పరభాషా చిత్రాలు దండయాత్ర చేస్తున్నాయి. జై భీమ్, ఆకాశం నీ హద్దురా, కేజిఎఫ్, కేజిఎఫ్2, ఖైదీ, సర్దార్, విక్రమ్, PS-1, విక్రాంత్ రోణ, కాంతార వంటి చిత్రాలు తెలుగులో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

తెలుగు స్టార్ హీరోచిత్రాల కలెక్షన్స్‌ని డబ్బింగ్ చిత్రాలు భారీగా గండికొట్టాయి. మొన్న బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన మెగాస్టార్ గాడ్‌ఫాదర్ బ్రేక్ ఈవెన్ కూడా కాకుండా చేసింది కాంతార. అయితే నిన్న విడుదలైన మరో తమిళ డబ్బింగ్ చిత్రం లవ్ టుడే సైతం టాలీవుడ్ లో భారీ విజయం దిశగా అడుగులేస్తోంది. నిన్ననే లవ్ టుడేతో పాటు అల్లరి నరేష్ ‘ఇట్లు మారెడుమిల్లి ప్రజానీకం’ చిత్రం కూడా విడుదలైంది. నిజానికి ఇట్లు మారెడుమిల్లికి మంచి సీరియస్ కంటెంట్ ఉన్న చిత్రమని టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం ఊహించినంత రావటం లేదు. దీనికి లవ్ టుడేనే కారణమంటున్నారు క్రిటిక్స్. దిల్ రాజు లవ్ టుడే హక్కులు తీసుకుని.. మంచి థియేటర్లన్నీ కట్టపెట్టి.. భారీగా ప్రమోషన్స్ చేశాడు. దీంతో లవ్ టుడే సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చాయని తెలుస్తోంది. లవ్ టుడే సాధించిన వసూళ్లలో కనీసం సగం కూడా రాబట్టలేకపోయింది ఇట్లు మారెడుమిల్లి ప్రజానీకం. లవ్ టుడేకు ఫస్ట్ డే నాడు 2.2కోట్ల గ్రాస్, 1.15 కోట్ల షేర్ వచ్చింది. అదే అల్లరి నరేష్‌ సినిమాకు అయితే 90 లక్షల గ్రాస్, 48 లక్షల షేర్ వచ్చింది. అంటే లవ్ టుడేలో మూడో వంతుని రాబట్టింది ఇట్లు మారెడుమిల్లి ప్రజానీకం. చూస్తుంటే ఈ వీకెండ్ మొత్తం లవ్ టుడే మేనియానే కనిపించేట్టుంది.