Love Today Movie Review
mictv telugu

లవ్ టుడే రివ్యూ

November 25, 2022

Love Today Movie Review

తమిళంలో నవంబర్ 4న రిలీజై పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను దక్కించుకుంటున్న లవ్ టుడే సినిమా తెలుగులోనూ డబ్ అయి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి కోలీవుడ్ ఆడియెన్సుని అంతలా అలరించిన ఈ చిత్రం ఇక్కడి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? మొత్తంగా సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికొస్తే..

ప్రదీప్ ఉత్తమన్(ప్రదీప్ రంగనాథన్) నిఖిత (ఇవన) ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఒకరి గురించి ఒకరికి అన్నీ తెలుసన్న నమ్మకంతో ఉంటారు. పెళ్లి విషయం మాట్లాడడానికి నిఖిత తండ్రి వేణు స్వామి (సత్యరాజ్) దగ్గరికెళ్తే ఓ షరతు పెడతాడు. ప్రదీప్, నిఖిత ఇద్దరూ ఒకరి ఫోన్లు ఒకరు ఓ రోజంతా మార్చుకుని ఆ తర్వాత సరే అంటే పెళ్లికి ఒప్పుకుంటానంటాడు. దాంతో మొబైల్స్ మార్చుకున్నాక వీరిద్దరికి వచ్చిన గొడవలేంటి? తెలిసిన రహస్యాలేంటి? చివరికి వీళ్ల ప్రేమ కథ సుఖాంతమయ్యిందా? లేదా? అనేదే కథ.

కథనం ఎలా ఉందంటే..

అసలు కథ ఏంటని ట్రైలర్లోనే చెప్పేసినా సినిమా కథనం ఆసక్తికరంగానే సాగింది. ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా, ఫుల్ కామెడీగా నడిచింది. సెకండాఫ్ కూడా ఫన్ ఫ్లేవర్ మిస్సవ్వకుండా ట్రాక్ తప్పకుండా సాగినా చివరి ఇరవై నిమిషాలు ఎమోషనల్ గా డ్రైవ్ అవుతుంది. దాంతో ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త ల్యాగ్ అనిపించినా మొత్తంగా మాత్రం ప్రేక్షకుల్ని నవ్విస్తూనే మంచి సందేశమిచ్చిందీ చిత్రం.

నటీనటులు, మేకింగ్, టేకింగ్, టెక్నికల్ ఎలిమెంట్స్

ప్రదీప్ రంగనాథనే ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తో పాటు హీరోగా కూడా చేయడం చాలా వరకు కలిసొచ్చింది. దర్శకుడిగా మొదటి చిత్రం కోమాలితోనే తన ప్రతిభను నిరూపించుకున్న ప్రదీప్ ఈ మూవీతో యాక్టర్ గానూ కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ఇవన కూడా ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడం పక్కా. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం చిత్రానికి ప్రధాన బలం. ఎమోషనల్, కామెడీ సీన్లు అన్న తేడా లేకుండా అన్ని సన్నివేశాలకీ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. యోగిబాబు, సత్యరాజ్, రాధిక తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.

ఓవరాల్ గా ఎలా ఉందంటే..

లవ్ టుడే.. పేరుకు తగ్గట్టుగానే ఈరోజుల్లో ప్రేమలెలా ఉన్నాయో? మొబైల్స్ లో సీక్రెట్స్ వల్ల రిలేషన్లో వచ్చే సమస్యలేంటో చూయిస్తూనే మంచి మెసేజిచ్చారు. కామెడీ లవర్స్ అయితే సినిమాని ఇంకో లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా హాయిగా చూసేయొచ్చు ఈ సినిమాని.