ఇవాంకాకు పోరగాని ప్రేమలేఖ... - MicTv.in - Telugu News
mictv telugu

ఇవాంకాకు పోరగాని ప్రేమలేఖ…

November 27, 2017

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు కోసం హైదరాబాద్‌కు వస్తున్న అమెరికా అధినేత ముద్దుల కూతురు ఇవాంకాకు ఓ అజ్ఞాత యువకుడు ప్రేమలేఖ రాశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. మరి ఏం రాశాడో మీరూ..  చదవండి.

మైడియర్ ఇవాంకా…

.నీ చేతులను ముద్దాడాలని ముత్యాలు పొదిగిన లక్క గాజులు చార్మినార్ కాడ ఎదురు చూస్తున్నయ్

నీకు మా రుచులను పరిచయం చేయడానికి  ఫలక్‌నామా ఉవ్విళ్లూరుతుంది

నీ శరీరాన్ని హత్తుకోవాలని చేనేత చీరలు ఆశతో ముడతలు పడుతున్నాయ్

నీ శ్వాసను ఆస్వాదించాలని హైదరాబాద్‌ గాలికి గాలాడక ఉక్కిరిబిక్కిరవుతోంది

నీ రాకకోసం ఎదురు చూస్తూ ఆరిపోతున్న మా ప్రాణాలకు  త్వరగా వచ్చి  ప్రాణం పొయ్యి..

నీ రాక కోసం చార్మినార్‌లో గాజులకంటే, అందంగా ముస్తాబైన హైదరాబాద్ రోడ్లకంటే, ఇక్కడి అధికారులకంటే..అంతెందుకు హైదరాబాద్ వాతావరణం కంటే ఎక్కువగా నిన్ను చూడాలని.. నా మనసు తహతహలాడుతోంది.

ఇన్నాళ్లు లంగావోణీలో ఉన్న అమ్మాయిలే అందంగా ఉంటారని అనుకునే నా కళ్లకు.. స్కర్టులు, జీన్సులు వేసుకునే నువ్వు, ముగ్గురు పిల్లలకు తల్లివైన నువ్వు మరెంతో అందంగా కనిపిస్తున్నావ్.. ఎందుకో తెలుసా? నీరాకతోనైనా  హైదరాబాద్‌లో ఉన్న కొన్ని రోడ్లకు పట్టిన దరిద్రం వదిలింది. కేవలం ఊహల్లోనే ఉండే ఎన్నో అందమైన చిత్రాలు.. ఇంద్రధనుస్సు రంగులనద్దుకొని ఫ్లైఓవర్లను, రోడ్లపక్కన ఉన్న గోడలను పావనం చేశాయి.

ఇంతకు ముందు నడిరాతిరి  హైదరాబాద్ రోడ్లపై వెళదామంటే కుక్కలు ఎక్కడ పిక్కలు పీకుతాయో అని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ వెళ్లే వాడిని.  కానీ నీ పుణ్యమా అని, వాటికి కుక్కచావే గతి అయ్యింది. స్వచ్చభారత్, స్వచ్చ హైదరాబాద్‌తో కూడా సాధ్యంకాని స్వచ్చత.. కేవలం నీ రాకతో.. నీ ఒక్కదాని రాకతోనే  సాధ్యమయ్యింది. అందుకే నువ్వంటే నాకిష్టం. ఇంతకు ముందు దేశాన్ని దోచుకున్న తెల్లవాళ్లని అసహ్యించుకున్న నేను… మొదటిసారి…తెల్లపిల్లను ఇంతగా ఇష్టపడుతున్నాను అంటే నాకే నమ్మబుద్ది కావడంలేదు.

కంపనోరు వేసుకుని ఎప్పుడూ..ఎగిరి దుంకే ట్రంప్  కడుపున ఇంత అందమైన నువ్వు పుట్టావంటే అస్సలు నమ్మబుద్ది కావడంలేదు. అయినా సరే నీలాంటి అద్భుత సౌందర్యాన్ని ఆస్వాదించబోతున్నందుకు నాకు ఇప్పుడు నీ బాబు  కూడా ఇంపే. కానీ నీకు నాదో చిన్న విన్నపం. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా..తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాల్లో, గల్లీగల్లీలో, ముఖ్యంగా మా వూరిలో ఒక్కసారి అడుగుపెట్టవా ప్లీజ్…వచ్చే జన్మలో.. కాదు కాదు ఈ జన్మలోనే నీకు బానిసనై బతకడానికి నేను సిద్ధం..

                                                                                    నిన్ను ప్రేమిస్తూ..నిన్నే ప్రేమించే..

                                                                          మా ప్రాంతాన్ని అందంగా చూడాలనే ఆశతో  ఓ  అజ్ఞాత యువకుడు