పరువు హత్యలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేమికులను భయపెడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్లో హేమంత్ హత్య తర్వాత ప్రేమికులు పోలీసుల ఆశ్రయం కోరుతున్నారు. పెద్దల నుంచి తమకు రక్షణ కల్పించాలని విన్నవించుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎస్పీని ఓ ప్రేమ జంట రక్షణ కోసం అభ్యర్థించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. దీంతో పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు.
విజయవాడకు చెందిన దీపికకు రామచంద్రాపురానికి చెందిన వరప్రసాద్ అనే యువకుడు రైలు ప్రయాణంలో ఏడాది క్రితం పరిచయం అయ్యారు. అది కాస్త పెళ్లి వరకు వెళ్లింది. పెద్దలు అంగీకరించకపోవడంతో పారిపోయి వివాహం చేసుకున్నారు. దీంతో తమకు అమ్మాయి తరుపు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇప్పటికే కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసు స్టేషన్ లో అమ్మాయి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారు. ఎస్పీ ఆఫీసు అధికారులు ప్రస్తుతం ఈ జంటను రామచంద్రాపురం పోలీసుల ఆధీనంలోకి పంపించారు.