దేశ వ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు గజగజ వణిపోతున్నారు. ఎప్పుడూ లేనంతగా చలి వణికించడంతో బయటకు రావలంటేనే భయపడుతున్నారు. ఉదయం పూట పనికి వెళ్ళేవారు, ప్రయాణాలు చేసేవాళ్లు చలి కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఈశాన్య భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలో గాలులు వీస్తున్నందున రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందంటున్నారు.
ఏపీ మన్యంలో అత్యల్పం
సాధారణ రోజుల్లోనే తక్కువ టెంపరేచర్ ఉండే విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పడిపోయాయి. ఎన్నడూ లేని విధంగా సాధారణం కంటె 3 నుంచి 5 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో అత్యల్పంగా 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లితో పాటు హుకుంటే, జి.మాడుగుల మండలం కుంతలం, గూడెం కొత్త వీధి మండలం జీకే వీధిలో కూడా ఇదే తరహా ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. నుములూరులో 6, పాడేరు 9, అరకులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అందమైన ప్రదేశాలను వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులను చలి తీవ్రత భయపెడుతోంది.
తెలంగాణలో ఇదే పరిస్థితి
తెలంగాణ ప్రజలు కూడా చలితో వణికిపోతున్నారు. హైదరాబాద్ నుంచి ఆసిఫాబాద్ ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. దీంతో వాతావరణ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సిర్పూర్లో అత్యల్పంగా 4.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. సంగారెడ్డి జిల్లా కోహిర్ 4.6, నల్లవల్లి 5.7, న్యాల్కల్ 5.9 ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్‌లో 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టపూర్లో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ నగరంలోని వెస్ట్‌మారేడ్‌పల్లిలో అత్యల్పంగా 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నగర ప్రజలు కూడా చలి గాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బీ అలెర్ట్
మరో మూడు రోజుల పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు కొనసాగవచ్చని వాతవరణ శాఖ చెబుతోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోసం సంబంధిత సమస్యలున్నవాళ్లు జాగ్రత్తపడాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దూర ప్రయాణాలు చేసే వారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు స్వెటర్లను ధరించాలని కోరారు.