పేద ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసిందని, అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.50 చొప్పున, కమర్షియల్ సిలిండర్ పై రూ. 350 చొప్పున పెంచడం దారుణమైన చర్య అని మండిపడ్డారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. రెండు లక్షల 14వేల కోట్ల రూపాయలను యూపీఏ ప్రభుత్వం హయాంలో సబ్సిడీ కింద ఇచ్చారని, బీజేపీ ప్రభుత్వం 37,209 కోట్ల సబ్సిడీ ఇస్తుందంటే ఎంత తగ్గించిందనేది అర్థమవుతుందని అన్నారు.
“2014 లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కో సిలిండర్ మీద రూ.350 సబ్సిడీ ఉండేదని, క్రమంగా తగ్గిస్తూ ఇప్పుడు సున్నా చేశారు. నాడు గ్యాస్ ధరలు రూ.400 ఉంటే అప్పటి బీజేపీ నేతలు గగ్గోలు పెట్టారు. స్మృతి ఇరానీ గ్యాస్ బండతో రోడ్ల మీద ధర్నా చేశారు. ఇప్పుడు అదే స్మృతి ఇరానీ కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారి ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇప్పు ఏం సమాధానిమిస్తారని” ప్రశ్నించారు. ఒకవైపు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచి సామాన్యుడి ప్రయాణాన్ని భారంగా మార్చిన మోదీ ప్రభుత్వం.. మరోవైపు వంటగ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ జేబులు గుల్ల అయ్యే దుస్థితిని తీసుకొచ్చిందన్నారు.
“ఎన్నికలు అయిపోయిన ప్రతిసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం ఆనవాయితీగా మారింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు అలా అయిపోయాయో లేదో మళ్ళీ ధర పెంచారు. త్వరలో కర్ణాటక ఎన్నికలు వస్తున్నాయి. అవి అయిపోగానే మళ్ళీ పెంచుతారు. అంటే ఎన్నికల ముందు కల్లిబొల్లి మాటలు చెప్పి.. ఎన్నికలు కాగానే అడ్డగోలుగా ధరలు పెంచుతారు. ఎన్నికలు రాగానే 10 పైసలు తగ్గించి ఎన్నికలు అయిపోగానే రూ.100 రూపాయలు పెంచుతున్నాడు మోడీ. బీజేపీ పాలనలో ప్రజల తలసరి ఆదాయం డబుల్ కూడా కాలేదు కానీ, సిలిండర్ ధర మాత్రం మూడు రెట్లు పెరిగింది. బీజేపీ అంటే భారత జనాలను పీడించే పార్టీ” అని అన్నారు హరీశ్ రావు. నిండా ముంచిన బీజేపీని ముంచాలని ప్రభులు చూస్తున్నారని వెల్లడించారు.