సామాన్యుడికి షాక్.. ఎల్పీజీ సిలిండర్‌పై సబ్సిడీ ఎత్తేసిన కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

సామాన్యుడికి షాక్.. ఎల్పీజీ సిలిండర్‌పై సబ్సిడీ ఎత్తేసిన కేంద్రం

June 3, 2022

కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. వంట గ్యాస్‌ (ఎల్పీజీ) సిలిండర్లపై ఇస్తున్న రాయితీని ఎత్తేసింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్న పేదలకు మాత్రమే సిలిండర్లపై రాయితీ ఇవ్వనుంది. మిగిలిన వినియోగదారులంతా ఎల్పీజీ సిలిండర్‌ను మార్కెట్‌ ధరకు కొనుగోలు చేయాల్సిందే. ఈ విషయాన్ని ఆయిల్‌ సెక్రటరీ పంకజ్‌ జైన్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. కొవిడ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఎల్పీజీ వినియోగదారులకు సబ్సిడీ ఇవ్వడం లేదని, ఇకపై ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ అందివ్వనున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం సిలిండర్‌పై రూ.40 సబ్సిడీ ఇస్తున్నారు. ఇకపై అదికూడా ఉండదని చెప్పారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన మేరకు ఇకపై ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే ఎల్పీజీ సిలిండర్లపై రాయితీ ఇస్తామని చెప్పారు. ఉజ్వల లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై రూ.6100 కోట్ల భారం పడనుందన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.1003 ఉండగా.. ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ అందించనున్నారు. ఆ మొత్తం ఆయా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. దేశవ్యాప్తంగా 30.50 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా.. ఇందులో 9 కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులున్నారు. అంటే మిగిలిన 21 కోట్ల మంది సబ్సిడీకి దూరమైనట్లే.